Rakesh JhunJhunwala:ఇదేం మ్యాజిక్‌! గంటలో రూ.101 కోట్ల సంపాదన

6 Nov, 2021 17:10 IST|Sakshi

Rakesh Jhunjhunwala Made Rs 101 Crore From These 5 Stocks: మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరోసారి సంచలనం సృష్టించారు. ఊహకి అందని రీతిలో మార్కెట్‌లో ఎత్తులు వేస్తూ కాసుల వర్షం కురిపించే బిగ్‌బుల్‌ జాదూ మళ్లీ వర్కవుట్‌ అయ్యింది. 

ముహూరత్‌ ట్రేడింగ్‌
దీపావళి పండగ సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌లో ప్రతీ ఏడు ముహూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తారు. రెగ్యులర్‌ ట్రేడింగ్‌కి భిన్నంగా దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించి గంట పాటు లావాదేవీలు నిర్వహిస్తారు. ఈసారి కూడా దీపావళి రోజున కొత్త సంవత్‌ 2078కి స్వాగతం పలుకుతూ సాయంత్రం 6:15 గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు ముహూరత్‌ ట్రేడ్‌ నిర్వహించారు.

గంటలో రూ.101 కోట్లు
ముహూరత్‌ ట్రేడింగ్‌లో బిగ్‌బుల్‌ పో‍ర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీల షేర్లు బాగా లాభపడ్డాయి. దీంతో కేవలం గంట వ్యవధిలోనే ఆయన సంపాదనలో కొత్తగా రూ. 101 కోట్లు వచ్చి చేరాయి. ఓ రకంగా ప్రతీ సెకనుకి బిగ్‌బుల్‌ ఖాతాలో రూ.1.68 కోట్లు వచ్చి పడ్డట్టయ్యింది.

కాసులు కురిపించిన హోటల్‌ షేర్లు
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న వాటిలో ఇండియన్‌ హోటల్‌ కంపెనీ షేర్లు గంట వ్యవధిలో ఆరు శాతం వృద్ధిని కనబరిచాయి. కేవలం గంట వ్యవధిలో షేరు విలువ రూ.205 నుంచి రూ.215కి చేరుకుంది. కేవలం పది రూపాయలు షేరు ధర పెరగడంతో రాకేశ్‌ ఖాతాలో రూ.31.13 కోట్లు వచ్చి చేరాయి.

ఆ నాలుగు
- టాటా మోటార్స్‌లో బిగ్‌బుల్‌కి 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి ధర 1 శాతం పెరగడంతో గంట వ్యవధిలో రూ.17.82 కోట్ల ఆదాయం వచ్చి పడింది.
- రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ షేర్ల ధరలో 2 శాతం వృద్ధి కనిపించడంతో రాకేశ్‌ ఖాతాలో 21.72 కోట్లు వచ్చాయి.
- ఎస్కార్ట్‌ షేర్ల ధరలు పెరగడంతో రూ. 18.11 కోట్లు, డెల్టా కార్పొరేషన్‌ నుంచి రూ.12.6 కోట్లు ఆర్జించారు.

సెంటిమెంట్‌ అండతో
ముహూరత్‌ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి జరుగుతుందనే సెంటిమెంట్‌ ఉంది. బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో 1957 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కొత్తగా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు కూడా ఈ రోజు మొదలు పెడతారు. ఇలాంటి వారిలో చాలా మంది బిగ్‌బుల్‌ రాకేశ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆయా కంపెనీల షేర్ల బాగా పెరిగాయి. ఫలితంగా కేవలం గంటలో రాకేశ్‌ సంపాదన రూ. 101  కోట్లు పెరిగింది.
 

మరిన్ని వార్తలు