Rakesh Jhunjhunwala: జీ-సోనీ డీల్‌..! వారం రోజుల్లో సుమారు రూ. 50 కోట్ల లాభం..!

22 Sep, 2021 17:32 IST|Sakshi

భారత మీడియా రంగంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా మధ్య విలీనం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్‌ కు 52.93 శాతం మేర వాటాలు దక్కనున్నాయి. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్‌ 1.575 బిలియన్‌ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. 
చదవండి: సోనీటీవీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం !

కాసుల వర్షం కురిపించిన ఒప్పందం...!
జీ, సోనీ నెట్‌వర్క్స్‌ మధ్య జరిగిన ఒప్పందం...స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలాకు కాసుల వర్షం కురిపించింది. జీ, సోనీ నెట్‌వర్క్స్‌ల విలీన వార్తలతో బుధవారం మార్కెట్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీల్) షేర్లు 30% పైగా పెరిగాయి. దీంతో బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతవారం రాకేశ్‌ జున్‌జున్‌వాలా సుమారు 50లక్షల జీల్‌ షేర్లను కొనుగోలు చేశారు.  జీల్‌ ఒక్కో షేర్‌ను రూ. 220.4 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటి విలువ ఏకంగా రూ. 337 పెరిగింది.  దీంతో రాకేశ్‌ 50 శాతం మేర లాభాలను గడించారు.

జీ మీడియా చీఫ్‌ పునీత్‌ గోయెంకా బోర్డు నుంచి తప్పుకున్న రోజునే రాకేశ్‌తోపాటుగా , యూరప్‌కు చెందిన బోఫా సెక్యూరిటీస్‌ సుమారు 50 లక్షల షేర్లను కొన్నారు. కాగా పలువురు ఈ డీల్‌ గురించి ముందే తెలిసి జీల్‌ భారీగా షేర్లను కొన్నట్లు సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కచ్చితంగా ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌ జరిగి ఉండవచ్చునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్‌ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించడం గమనార్హం. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని జీ మీడియా వెల్లడించింది.
చదవండి: చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..?

మరిన్ని వార్తలు