ఒక్క నెలలో రూ.900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్!

29 Sep, 2021 18:42 IST|Sakshi

ది ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టె విషయం అందరికీ తెలిసిందే. అయితే, స్టాక్ మార్కెట్ అందరికీ కనక వర్షం కురిపించదు. స్టాక్ మార్కెట్‎పై పట్టు ఉన్న వారిని మాత్రమే లక్ష్మీ దేవి కరుణిస్తుంది. ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పిలిచే "బిగ్ బుల్ రాకేష్‌ జున్‌జున్‌వాలా" కొనుగోలు చేసిన టాటా మోటార్స్ షేరు ధర సుమారు 13 శాతం పెరగగా, టైటాన్ కంపెనీ షేర్లు 11.40 శాతం పెరిగాయి. ఈ రెండు కంపెనీల షేరు భారీగా పెరగడంతో రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ ఒక నెలలోనే ₹893 కోట్లు పెరిగింది.(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్!)

టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం బిగ్ బుల్ 3,77,50,000 షేర్లను కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో ప్రతి ఈక్విటీ షేర్ల ధర ₹287.30 నుంచి ₹331కు పెరిగింది. ప్రతి షేరు విలువ ₹43.70 పెరిగింది. దీంతో, రాకేష్‌ జున్‌జున్‌వాలా సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ వాటా హోల్డింగ్ నుంచి ₹164.9675 కోట్లు సంపాదించారు. అలాగే, టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. 'బిగ్ బుల్' 3,30,10,395 షేర్లను కలిగి ఉండగా, రేఖా జున్‌జున్‌వాలా(రాకేష్‌ జున్‌జున్‌వాలా భార్య) 96,40,575 వాటాలను కలిగి ఉన్నారు. కాబట్టి, ఇద్దరి పేరు మీద కలిసి టైటాన్ లో 4,26,50,970 షేర్లు ఉన్నాయి.

2021 సెప్టెంబర్ నెలలో టైటాన్ షేర్లు ₹1921.60 నుంచి ₹2092.50కు పెరిగింది. ఈ కాలంలో టైటాన్ కంపెనీ షేరు విలువ ₹170.90కి పెరిగింది. ఈ కంపెనీ షేర్ల విలువ ప్రకారం.. రాకేష్‌ జున్‌జున్‌వాలా ₹728.90 కోట్లు సంపాదించారు. కాబట్టి, ఈ రెండు టాటా గ్రూప్ స్టాక్స్ లో బిగ్ బుల్ నికర విలువ సెప్టెంబర్ 2021లో 893.87 కోట్లు పెరిగింది. జున్‌జున్‌వాలా తన స్వంత పేరు, అతని భార్య రేఖా పేరుతో రెండింటిలోనూ భారీగా పెట్టుబడి పెట్టారు.(చదవండి: బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?)

మరిన్ని వార్తలు