‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’గా రామ్‌కీ ఎన్విరో

10 Mar, 2022 04:55 IST|Sakshi
సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్‌ రెడ్డి (ఎడమ వ్యక్తి), జేఎండీ మసూద్‌ మలిక్‌

పేరు రీబ్రాండింగ్‌ హైదరాబాద్‌లో తొలి ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటు

సంస్థ సీఈవో గౌతమ్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’గా దీన్ని రీబ్రాండ్‌ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్‌ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. వాహనాల స్క్రాపింగ్‌కు సంబంధించి తమ తొలి ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌ వెహికల్‌ (ఈఎల్‌వీ) రీసైక్లింగ్‌ ప్లాంటు .. న్యూఢిల్లీలో వచ్చే ఆరు నెలల్లో ఏర్పాటవుతోందని గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ఈఎల్‌వీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వివరించారు. వీటి ఏర్పాటుకు ఒక్కో దానికి రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ‘ప్రస్తుతం భారత్‌ .. రీసైక్లింగ్‌ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రిఫైనింగ్‌ ప్రక్రియలో మదర్‌బోర్డులను ప్రాసెస్‌ చేసి .. బంగారం, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలను రాబడతాం‘ అని ఆయన చెప్పారు.  

రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు ..
రాబోయే మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేయనున్నట్లు గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లే యోచనేదీ లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు దాదాపు రూ. 3,000 కోట్లుగాను, లాభాలు సుమారు రూ. 550 కోట్ల స్థాయిలోను ఉండగలవని అంచనా వేస్తున్నట్లు గౌతమ్‌ రెడ్డి వివరించారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. కంపెనీ ఏటా 6–7 మిలియన్‌ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు