‘5 ట్రిలియన్‌ ఎకానమీ.. అబ్బో కష్టమే’

8 Oct, 2021 14:42 IST|Sakshi

భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరుపై ఆర్థిక వేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ సీ రంగరాజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మరో ఆర్థిక ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇక్ఫాయ్‌లో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. 

అప్పట్లో
కరోనా సంక్షోభం తలెత్తడానికి ముందు వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉందన్నారు. 2019లో 2.3 ట్రిలియన్‌ డాలర్లతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేందని, అప్పుడు ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంతో కొనసాగిందని గుర్తు చేసుకున్నారు . అదే  స్పీడు మరో ఐదేళ్లు కొనసాగి ఉంటే 2025 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది అని రంగరాజన్‌ అన్నారు. 

పరిష్కారం అయ్యేవి
భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుని ఉంటే దేశంలో నెలకొన్ని ఎన్నో సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభించేంది. అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవన్నారు. కానీ కరోనా ఎఫెక్ట్‌ వల్ల అనుకున్న లక్ష్యాన్ని ఇప్పుడు సాధించడం కష్టమేననంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

కీలకం
కరోనా మొదటి వేవ్‌ ప్రజల ఆరోగ్యం మీదకంటే దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీసిందని, సెకండ్‌ వేవ్‌ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిందని రంగరాజన్‌ అన్నారు. మొత్తంగా కరోనా వల్ల రోజువారి కూలీల జీవితం దుర్భరంగా మారిందన్నారు. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం, జీవించడం కష్టంగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు

తేరుకోవాలి
మన ఆర్థిక సమస్యలు తీరాలంటే ఇప్పుడున్న వృద్ధి రేటు సరిపోదని, కచ్చితంగా పెంచాల్సిందేనని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్నారు. దాన్ని కాచుకుంటూ ఎకానమినీ బలోపేతం చేయాలన్నారు. అది జరగాలంటే ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తూనే దానికి సమాంతరంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు కావాలని, అక్కడ పెట్టుబడులు పెరగాలని ఆయన సూచించారు.

చదవండి : ఆర్బీఐ భారీ ఊరట.. ప్రస్తుతానికి యథాతథ స్థితి! మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలివే!

మరిన్ని వార్తలు