ఆ విషయంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి - రతన్‌ టాటా

29 Jun, 2022 20:13 IST|Sakshi

గ్లోబల్‌ ఎకానమీగా ఎదిగేందుకు ఇండియా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఫార్మా రంగంలో ప్రపంచానికి పెద్దన్నలా మారింది. చిన్న నగరాల నుంచి పెద్ద కంపెనీలు పుట్టుకొస్తున్నాయ్‌. మూడు పదుల వయసులోనే యంగ్‌ ఎంట్రప్యూనర్లు బిలియనీర్లుగా మారుతున్నారు. ఈ మార్పుకు సాక్షిగా నిలిచినవారిలో రతన్‌టాటా ఒకరు. ఓ సందర్భంగా దేశీయంగా వచ్చిన మార్పులను రతన్‌టాటా వివరించారు. దాన్ని ట్విటర్‌ ద్వారా మరో ఇండస్ట్రియలిస్టు హర్ష్‌ గోయెంకా మనకు షేర్‌ చేశారు.

ఎంటర్‌ప్యూనర్‌షిప్‌ గురించి రతన్‌ టాటా మాట్లాడుతూ.. తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక యువ ఉద్యోగి కొత్త ఐడియాతో తన బాస్‌ లేదా మేనేజర్‌ను సంప్రదిస్తే.. ‘ ముందు నువ్వు ఒక ఐదేళ్లు పని చేయ్‌. అప్పుడే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుంటావ్‌’ ‘ చేతులు పైకి మడిచి ఆఫీస్‌లో కష్టపడి పని చేయ్‌, ఆ తర్వాత ఐడియాల గురించి ఆలోచిద్దువు కానీ’ అనే సమాధానాలే వారికి వినిపించేవి. ఎక్కడా ప్రోత్సాహకర వాతావరణం ఉండేది కాదని రతన్‌ టాటా తెలిపారు.

ఇదే అంశంపై మరింత వివరణ ఇస్తూ రతన్‌ టాటా ఇలా అన్నారు.. ‘ఇప్పుడయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్‌. ఒక యంగ్‌ ఎంట్రప్యూనర్లకు మంచి ఐడియాలతో పాటు వాటిని ఎలా అమలు చేయాలో కూడా తెలుసు. వారు ఇరవైలలో ఉన్నా సరే తమ ఐడియాలను నిజం చేసుకోవడంలో ముందుంటున్నారు’ అని రతన్‌టాటా అన్నారు. పారిశ్రిమికంగా, కొత్త అవకాశాలను సృష్టించడంలో యాభై ఏళ్ల క్రితం దేశంలో పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు.

చదవండి: టాటా చేతికి ఎన్‌ఐఎన్‌ఎల్‌, మా లక్ష్యం అదే!

మరిన్ని వార్తలు