సైరస్ మిస్ట్రీకు మళ్లీ దెబ్బ.. స్పందించిన రతన్‌ టాటా

20 May, 2022 06:35 IST|Sakshi

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ సంస్థలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ‘క్షమించండి, సమీక్ష పిటిషన్‌ను స్వీకరించడంలేదు. దీనిని తోసిపుచ్చుతున్నాం’’ అని ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న,  వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.  2021 తీర్పును సమీక్షించాలని కోరుతూ ఎస్‌పీ గ్రూప్‌ సంస్థలు సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.  

2021 తీర్పులోని కొన్ని వ్యాఖ్యల   తొలగింపునకు మాత్రం ఓకే
కాగా, బెంచ్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా రాసినట్లు కనబడుతున్న కొన్ని పేరాలను సైరస్‌ మిస్త్రీ ఉపసంహరించడానికి సిద్ధంగా ఉన్నాడని ఎస్‌పీ గ్రూప్‌ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేయడంతో సైరస్‌ మిస్త్రీకి వ్యతిరేకంగా 2021 తీర్పులో చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘‘2021 తీర్పు పత్రికా ప్రకటన కంటే దారుణంగా ఉంది’’ అంటూ సమీక్షా పిటిషన్‌లో వాడిన  పదజాలంపై బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అది సరైనది కాదు, మీరు ముందుగా ఆ పేరాలను ఉపసంహరించుకోండి’’ అని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌పీ గ్రూప్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదికి సూచించారు. ధర్మాసనాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశం లేదని ఈ సందర్భంగా మిస్త్రీ తరపు న్యాయవాది సోమశేఖరన్‌ సుందరం పేర్కొన్నారు.  ఆయా అభ్యంతరకర పేరాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని తెలిపారు.  

పూర్వాపరాలు ఇవీ...
మిస్త్రీ 2012లో రతన్‌ టాటా తర్వాత టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నాలుగేళ్ల తర్వాత 2016లో అక్టోబర్‌లో బోర్డ్‌ ఆయనను ఆకస్మికంగా తొలగించింది.   మిస్త్రీని తొలగింపు ‘రక్త క్రీడ’, ’ఆకస్మిక దాడి’ లాంటిదని, ఇది కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సూత్రాలను, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎస్‌పీ గ్రూప్‌ వాదించింది.  టాటా గ్రూప్‌ ఈ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించింది. మిస్త్రీని చైర్మన్‌గా తొలగించే హక్కు బోర్డుకు ఉందని, ఈ విషయలో బోర్డ్‌ ఎటువంటి తప్పు చేయలేదని వాదించింది.

తొలుత నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) చైర్మన్‌ బాధ్యతల్లో పునఃనియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై టాటా సన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా,  కార్పొరేట్‌ గవర్నర్స్‌కు సంబంధించి కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని మిస్త్రీ కూడా అప్పీల్‌కు వెళ్లారు. ఈ క్రాస్‌ అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు, 2021 మార్చి 26న తుది తీర్పును ఇస్తూ, మిస్త్రీని తొలగిస్తూ, బోర్డ్‌ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌)లో యాజమాన్య ప్రయోజనాలను విభజించాలని కోరుతూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

మరిన్ని వార్తలు