ముద్ద‌ ముట్ట‌ని పెంపుడు కుక్క‌లు, ప్రిన్స్‌ ఛార్లెస్‌ అవార్డు కార్యక్రమానికి ‘రతన్‌ టాటా’ డుమ్మా!

12 Sep, 2022 16:26 IST|Sakshi

అత్యధిక కాలం బ్రిటన్‌ను పరిపాలించిన రాణి ఎలిజబెత్‌-2 అస్తమయం కావడంతో  యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్‌ ఛార్లెస్‌ నియమితులు అయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్‌ కౌన్సిల్‌ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్‌ రాజుగా ప్రిన్స్‌ ఛార్లెస్‌, రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్‌ బౌల్స్‌ (75)లు అధికారికంగా సంతకాలు చేశారు. 

 ఈ సందర్భంగా మనదేశానికి చెందిన నెటిజన్‌లు, వ్యాపార దిగ్గజాలు బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌, దేశీయ దిగ్గజం రతన్‌ టాటా'ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పెంపుడు కుక్కల విషయంలో రతన్‌ టాటా - ప్రిన్స్‌ ఛార‍్లెస్‌తో జరిగిన సంభాషణల్ని నెట్టింట్‌లో షేర్‌ చేస్తున్నారు. 

రతన్ టాటా దాతృత్వానికి గుర్తింపుకు గాను ఆయనను లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించాలని 2018 ఫిబ్రవరి 6న ప్రిన్స్‌ ఛార్లెస్‌.. లండన్‌ రాయల్‌ రెసిడెన్సీ బంకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సవానికి రతన్‌ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? రెండు పెంపుడు కుక్కల వల్ల. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఇది అక్షరాల నిజం. ఇదే అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన కాలమిస్ట్‌, వ్యాపార వేత్త సుహెల్ సేథ్ నాటి మధుర స్మృతుల్ని సోషల్‌ మీడియాతో  పంచుకున్నారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతన్‌ టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. 

రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అవార్డును ప్రధానం  చేసేందుకు లండన్‌ రాయల్‌ రెసిడెన్సీ బంకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌ను సర్వం సిద్ధం చేశారు. ‘‘ 2018 ఫ్రిబవరి 2,3 తేదీలలో  బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్‌ కోసం నేను లండన్‌కు చేరుకున్నాను. లండన్‌ ఎయిర్‌ పోర్ట్‌ దిగిన తర్వాత టాటా నుండి సుమారు 11 మిస్డ్ కాల్‌లు రావడంతో షాకయ్యా. వెంటనే నా బ్యాగ్‌లను తీసుకొని ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వస్తూ ఆయనకు కాల్‌ చేశా. టాంగో, టిటో (రతన్‌ టాటా కుక్కలు ) అనారోగ్యానికి గురయ్యాయి. తిండి తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. నేను వాటిని వదిలి రాలేను అని’’ తనతో చెప్పినట్లు సుహెల్ సేథ్ గుర్తు చేసుకున్నారు.   

ప్రిన్స్ చార్లెస్‌ ఈవెంట్‌కు టాటా వచ్చేలా నేను ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. టాటా తన అవార్డును స్వీకరించేందుకు రాలేదు. ఈ సందర్భంగా అవార్డుల కార్యక్రమానికి రతన్‌ టాటా ఎందుకు రాలేదో తెలుసుకున్న ప్రిన్స్‌ ఛార్లెస్‌.. టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు.‘‘మనసున్న మారాజు..అతడే రతన్ టాటా ” అని ప్రిన్స్ చార్లెస్‌ అన్నట్లు సేథ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు