ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!

8 Oct, 2021 18:59 IST|Sakshi

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన సొంత గూటికి చేరుకోనుంది. టాటా సన్స్ బృందం బిడ్‌ను గెలుచుకున్నందుకు ఆ కంపెనీ ఛైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా హర్షం వ్యక్తం చేశారు. "ఎయిరిండియాకు తిరిగి స్వాగతం’’ అంటూ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టాటా ఎయిర్ ఇండియా విమానం నుంచి కంపెనీ మాజీ ఛైర్మన్‌ జే.ఆర్‌.డీ టాటా దిగిపోతున్న పాత ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫోటోలో "ఎయిర్ ఇండియా బిడ్ గెలవడం టాటా గ్రూప్‌కు గ్రేట్ న్యూస్! ఎయిర్ ఇండియాను పునర్నిర్మించడానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ.. విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్‌కు ఇది చాలా బలమైన మార్కెట్ అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. ఒకప్పుడు జే.ఆర్.డీ. టాటా నాయకత్వంలో ఎయిర్ ఇండియా, ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి పొందింది. టాటాలకు ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్‌ వైభవం తీసుకొచ్చేందుకు మళ్లీ అవకాశం లభించింది. ఈ రోజు జే.ఆర్‌.డీ మన మధ్యలో ఉంటే చాలా సంతోషించేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్‌కమ్‌ బ్యాక్‌, ఎయిరిండియా!’’ అని రతన్‌ టాటా సంతకం చేశారు.(చదవండి:  ఎయిర్‎టెల్ బంపర్ ఆఫర్.. రూ.6000 క్యాష్‎బ్యాక్!)

1946లో టాటా సన్స్‌ ఏవియేషన్‌ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్‌ సర్వీసే నాంది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్‌ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్‌ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది.

మరిన్ని వార్తలు