క్రికెటర్స్‌.. ‘గేమ్‌’చేంజర్స్‌..!

26 Dec, 2020 00:41 IST|Sakshi

కొత్త వ్యాపార రంగాల్లో మెరుపులు...

ఫ్యాషన్, గ్రూమింగ్‌ ఉత్పత్తులపై ఆసక్తి

రవిశాస్త్రి కూడా రంగంలోకి...; 23 యార్డ్స్‌ సంస్థ ఏర్పాటు

కొన్నాళ్ల క్రితం దాకా ఎక్కువగా ఫుడ్‌ బిజినెస్‌ వైపు మొగ్గు చూపిన క్రికెటర్లు ప్రస్తుతం ఇతరత్రా రంగాలపై దృష్టి పెడుతున్నారు. ఫ్యాషన్, ఫిట్‌నెస్, గ్రూమింగ్‌ ఉత్పత్తులు మొదలైన వాటిపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా కోచ్‌ రవి శాస్త్రి కూడా ఈ జాబితాలో చేరాడు. 23 యార్డ్స్‌ పేరిట పురుషుల సౌందర్య సాధనాల శ్రేణిని ప్రవేశపెట్టాడు. ఇందుకోసం ఆదూర్‌ మల్టీప్రొడక్ట్స్‌ సంస్థతో జట్టు కట్టాడు. 23 యార్డ్స్‌ బ్రాండ్‌తో బాడీ వాష్, షేవింగ్‌ జెల్, డియోడరెంట్, శానిటైజర్‌ వంటి ఉత్పత్తులు లభిస్తాయి. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ మాధ్యమంలోనే వీటిని విక్రయిస్తున్నారు. దేశీయంగా పురుషుల గ్రూమింగ్‌ ఉత్పత్తుల మార్కెట్‌ దాదాపు రూ. 5,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా.

కోహ్లి అండ్‌ కో..: ఇప్పటికే చాలా మంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు.. ఇలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఫ్యాషన్‌ లేబుల్‌ రాంగ్, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ టీమ్‌ ఎఫ్‌సీ గోవాలో వాటాలు ఉన్నాయి. అలాగే జిమ్‌ చెయిన్‌ చిజెల్, స్టార్టప్‌ సంస్థలు స్పోర్ట్‌ కన్వో, స్టెపథ్లాన్‌ కిడ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేశాడు. అటు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా ఫిట్‌నెస్‌ క్లబ్‌ స్పోర్ట్స్‌ఫిట్, ఫిట్‌నెస్‌.. లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ సెవెన్,  ఐఎస్‌ఎల్‌ టీమ్‌ చెన్నయిన్‌ ఎఫ్‌సీలో పెట్టుబడులు పెట్టాడు. అదే బాటలో మరో క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ గతేడాది గల్లీ బ్రాండ్‌ పేరుతో దుస్తుల విభాగంలోకి అడుగుపెట్టాడు.

ఇందుకోసం జెకో ఆన్‌లైన్‌ అనే రిటైల్‌ సంస్థతో జట్టు కట్టాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లతో చేతులు కలిపాడు. గల్లీ బ్రాండ్‌తో ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యాపార విభాగంలోకి కూడా అడుగుపెట్టడంపై రాహుల్‌ దృష్టి పెడుతున్నాడు. ఇక, 2019 వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు యజువేంద్ర చహల్‌ తన సొంత లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్‌ చెక్‌మేట్‌ను ప్రవేశపెట్టాడు. గతంలో యువరాజ్‌ సింగ్‌ కూడా హెల్తియన్స్, వ్యోమో, కారటిసన్, జెట్‌సెట్‌గో వంటి సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేశాడు.

ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోదు ..
సాధారణంగా క్రికెటర్లు ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్‌ చేస్తే దానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇందుకు గాను సదరు వ్యాపారంలో ఎంతో కొంత వాటాలు తీసుకోవడం ద్వారా ఇన్వెస్టరుగా మారుతుంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా డబ్బులు ఇన్వెస్ట్‌ చేసే క్రీడాకారులు చాలా తక్కువగా ఉంటారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలంలో చూస్తే కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల ఉపయోగం లేదని బ్రాండింగ్‌ ప్రొఫెషనల్స్‌ అభిప్రాయపడ్డారు. సదరు వ్యాపారంలో వారు కూడా చురుగ్గా పాలుపంచుకుంటేనే ఉపయోగం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉదాహరణకు కేఎల్‌ రాహుల్‌ను చూస్తే.. గల్లీ బ్రాండ్‌కి సంబంధించి డిజైన్‌ నుంచి రంగుల ఎంపిక దాకా అన్ని విషయాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటాడు.  ఇన్వెస్టర్లుగా మారిన క్రీడాకారులు ఆయా వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా.

లాభదాయకమేనా..
క్రికెటర్లు పెట్టుబడులు పెట్టిన  వ్యాపారాలు .. లాభాలు ఆర్జించడంలో మిశ్రమ ఫలితాలు కనపరుస్తున్నాయి. కోహ్లికి చెందిన రాంగ్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసే యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌ (యూఎస్‌పీఎల్‌) వేల్యుయేషన్‌ ప్రస్తుతం రూ. 1,200 కోట్ల పైగా ఉంటుంది. కానీ ఇది ఇంకా లాభాల్లోకి మళ్లాల్సి ఉంది. యాక్సెల్, అల్టీరియా క్యాపిటల్‌ వంటి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్‌ చేశాయి. కోహ్లి ఇటీవలే మరో రూ. 13.2 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాడు. యూఎస్‌పీఎల్‌ ఏర్పాటైన తొలినాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఇన్వెస్ట్‌ చేశాడు. అటు ధోనీకి చెందిన సెవెన్‌ బ్రాండ్‌ సైతం చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రాచుర్యం పొందలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2016లో ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్‌ దుస్తులు.. అన్ని ఈ–కామర్స్‌ సైట్లలోనూ కనిపిస్తున్నప్పటికీ కేవలం ధోనీ ఆకర్షణ శక్తి మీదే వీటి అమ్మకాలు ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయని
వివరించాయి.    

మరిన్ని వార్తలు