ప్రస్తుత డిజిటల్‌ రుణాలకూ కొత్త నిబంధనలు

3 Sep, 2022 06:03 IST|Sakshi

నవంబర్‌ 30 నుంచి అమలు చేయాలి

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: డిజిటల్‌ రుణాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనలను, ఇప్పటికే పంపిణీ చేసిన డిజిటల్‌ రుణాలకు సైతం వర్తింపజేయాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఇందుకు నవంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనైతిక రుణ వసూళ్లను కట్టడి చేస్తూ నూతన నిబంధనలను ఆర్‌బీఐ గత నెలలో ప్రకటించింది. డిజిటల్‌ రుణాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఫిన్‌టెక్‌ సంస్థలు కస్టమర్ల నుంచి చార్జీ వసూలు చేయకూడదని కూడా ఆదేశించింది.

బ్యాంకులే ఈ చార్జీలను చెల్లించాలని నిర్దేశించింది. మొబైల్‌ యాప్‌లు, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా మంజూరు చేసే రుణాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే తీసుకున్న డిజిటల్‌ రుణాలు, తాజాగా తీసుకునే వాటికి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ప్రస్తుత రుణాలనూ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం ఇస్తున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త నిబంధనల కింద రుణాన్ని బ్యాంకు నేరుగా రుణ గ్రహీత ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ లేదా డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ (డీఎల్‌ఏ)  ద్వారా రుణ దరఖాస్తు వచ్చినప్పటికీ, ఆ రుణాన్ని మంజూరు చేసే సంస్థ, నేరుగా రుణ గ్రహీతకు అందించాలి.

>
మరిన్ని వార్తలు