మరో బ్యాంక్‌ కథ ముగిసింది.. లైసెన్స్‌ రద్దు చేసిన ఆర్బీఐ!

10 Oct, 2022 21:39 IST|Sakshi

దేశంలోని స‌హ‌కార బ్యాంకుల్లో మ‌రో బ్యాంక్ క‌థ క్లైమాక్స్‌కు చేరింది. సరైన ఆర్థిక ప్రణాళికలు లేకుండా డిపాజిటర్లకు నగదు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది పుణె కేంద్రంగా ప‌ని చేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్‌`. ప్రస్తుతం ఈ బ్యాంక్‌ వ‌ద్ద స‌రిప‌డా పెట్టుబ‌డి, ఆదాయ మార్గాలతో పాటు ఆర్థికపరంగా సజావుగా పనిచేసేందుకు మూలధనం కూడా లేదు. ఈ నేపథ్యంలో దీని లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్ర‌క‌టించింది.

లైసెన్స్‌ రద్దు చేసిన ఆర్బీఐ
సోమ‌వారం నుంచి `ది సేవ వికాస్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్‌`కు సంబంధించిన బ్యాంకింగ్ వ్యాపార లావాదేవీలు మూసేస్తున్న‌ట్లు ఆర్బీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.  మహారాష్ట్రలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ బ్యాంక్‌ను మూసివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరడంతో పాటు బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించాలని కోరినట్లు తెలిపింది. ది వికాస్ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ స‌మ‌ర్పించిన డేటా ప్ర‌కారం 99 శాతం డిపాజిట‌ర్లు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ (డీఐసీజీసీ) ద్వారా పూర్తి డిపాజిట్లు పొందనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. 

గ‌త నెల 14న డీఐసీజీసీ ఆధ్వ‌ర్యంలో ఇన్సూర్డ్ డిపాజిట్ల ఆధారంగా రూ.152.36 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అనగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

చదవండి: బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్‌ ఏంటీ స్పీడ్‌!

మరిన్ని వార్తలు