బ్యాంక్‌ చీఫ్‌ల పదవీ కాలం 15 ఏళ్లు

27 Apr, 2021 04:15 IST|Sakshi

గరిష్ట వయస్సు 70 ఏళ్లు

పునర్నియామకాలకు కనీసం మూడేళ్ల గ్యాప్‌

ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

ముంబై: దేశంలోని ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్‌ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని 15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్‌ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్‌బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్‌లలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై మాస్టర్‌ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్‌బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది.

ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్‌ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్ని షరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటే తక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది.

చైర్మెన్, నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఎన్‌ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్‌ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకు మించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదని ఆదేశించింది.

మరిన్ని వార్తలు