RBI CBDC: డిజిటల్‌ రూపీ ట్రయల్స్‌ షురూ

1 Nov, 2022 05:13 IST|Sakshi

హోల్‌సేల్‌ లావాదేవీల కోసం

నేటి నుండి ప్రారంభం

ప్రభుత్వ బాండ్ల ‘సెటిల్మెంట్‌’కు వినియోగం

ముంబై: దేశీయంగా తొలిసారి డిజిటల్‌ రూపాయి (సీబీడీసీ) ప్రాజెక్టు నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్‌సేల్‌ లావాదేవీల కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు, వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్‌ రూపీ – రిటైల్‌ సెగ్మెంట్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది.

‘డిజిటల్‌ రూపీ (హోల్‌సేల్‌ విభాగం) తొలి పైలట్‌ ప్రాజెక్టు నవంబర్‌ 1న ప్రారంభమవుతుంది‘ అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్‌ లావాదేవీల సెటిల్మెంట్‌ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ మొదలైన 9 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి.    సీమాంతర చెల్లింపులకు కూడా పైలట్‌ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

సీబీడీసీతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్‌ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్‌ రూపంలో కాకుండా డిజిటల్‌ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్స్‌ ద్వారా డిజిటల్‌ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది.

లావాదేవీల సెటిల్మెంట్‌ రెండు బ్యాంకుల మధ్య,  ఆర్‌బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్‌లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్‌ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్‌బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్‌ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్‌ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి.

అలాగే ప్రత్యేకంగా పేపర్‌ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్‌బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్‌ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్‌బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్‌ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

అంతర్జాతీయంగా..
2022–23లో డిజిటల్‌ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్‌ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి.

మరిన్ని వార్తలు