విలీనాల తర్వాత బ్యాంక్‌ ‘సేవలు’ ఎలా ఉన్నాయ్‌?

26 Apr, 2021 23:56 IST|Sakshi

బ్యాంకింగ్‌పై వినియోగదారుల అభిప్రాయ సేకరణలో ఆర్‌బీఐ

సర్వేకు సిద్ధమైన 22 ప్రశ్నలు

సర్వే ఏజెన్సీకి త్వరలో బాధ్యతల అప్పగింత

జూన్‌ 22 నాటికి నివేదిక పొందేలా చర్యలు  

ముంబై: బ్యాంకింగ్‌ విలీనాల తర్వాత కస్టమర్లు ఎలాంటి సేవలు పొందుతున్నారు? ఆయా అంశాల పట్ల వారిలో సంతృప్తి ఎలా ఉంది? వంటి అంశాలను బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌– రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలుసుకోనుంది. ఈ మేరకు ఒక సర్వే నిర్వహణకు తగిన కసరత్తు ప్రారంభించింది. అత్యున్నత స్థాయి వర్గాల సమాచారాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే... 

కస్టమర్ల సేవల కోణంలో విలీనాల వల్ల ప్రయోజనం ఏదైనా ఉందా? అన్న ప్రధాన ప్రశ్నతోపాటు 22 ప్రశ్నలు సర్వేలో భాగం కానున్నాయి. 
ఎంపికకు వీలుగా ఐదు ఆప్షన్స్‌ ఉంటాయి. స్ట్రాంగ్లీ ఎగ్రీ, ఎగ్రీ, న్యూట్రల్, డిస్‌ఎగ్రీ, స్ట్రాంగ్లీ డిస్‌ఎగ్రీ (గట్టిగా ఆమోదిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, తటస్థం, వ్యతిరేకిస్తున్నా, గట్టిగా వ్యతిరేకిస్తున్నా) అనే ఐదింటిలో ఒకదానికి వినియోగదారు ఓటు చేయాల్సి ఉంటుంది. 
తెలుగురాష్ట్రాలుసహా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు మొత్తం 21 రాష్ట్రాల నుంచి 20,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరగనుంది. 
22 ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలు ప్రత్యేకంగా కస్టమర్లకు అందుతున్న సేవలు, 2019, 2020ల్లో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్‌ బ్రాంచీల్లో వివాద పరిష్కార యంత్రాంగం పనితీరుకు సంబంధించినవై ఉంటాయి. 

‘విలీనాల తర్వాత నేను ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనలేదు’, ‘సాధనం(సాధనాలు), సేవలు, ఏరియా అంశాలకు సంబంధించి నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను’, ‘సాధనం(సాధనాలు), సేవలు, ఏరియా అంశాలకు సంబంధించి నేను ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే...’ వంటి ప్రశ్నలు ఉంటాయి. 
‘బ్యాంక్‌ కస్టమర్లు– సేవల విషయంలో వారి సంతృప్తికి సంబంధించి సర్వే’ అనే పేరుతో నిర్వహించాలనుకుంటున్న ఈ సర్వే బాధ్యతలను ఒక ఏజెన్సీకి ఆర్‌బీఐ అప్పగించనుంది. ఈ విషయంలో కొటేషన్ల దాఖలుకు సంస్థలను ఆహ్వానిస్తోంది. 
నియమిత ఏజెన్సీ కస్టమర్‌ అభిప్రాయ సేకరణ జరుపుతుంది. ఈ అభిప్రాయాన్ని తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్, రాష్ట్రం, బ్రాంచీ, ఖాతా నెంబర్, పేరు వంటి వివరాలను కస్టమర్‌ నుంచి సవివరంగా తెలుసుకోవాలి. 
సర్వేకు వీలుగా 21 రాష్ట్రాల్లో ఎంపికచేసిన బ్యాంక్‌ బ్రాంచీల కస్టమర్ల ఫోన్‌ నెంబర్లను నియమిత ఏజెన్సీకి ఆర్‌బీఐ సమకూర్చుతుంది. ఏజెన్సీ 2021 జూన్‌ 22వ తేదీ నాటికి సర్వే పూర్తిచేసి ఆర్‌బీఐకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 

27 నుంచి 12కు బ్యాంకులు..
పలు విలీన చర్యల నేపథ్యంలో 2017 మార్చిలో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ప్రస్తుతం 12కు పడిపోయింది. 2019లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేసింది. దిగ్గజ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఐదు అనుబంధ బ్యాంకులను అలాగే భారతీయ మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేసింది. 

ఇక 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాలుగింటిగా మార్పుతూ చేసిన విలీన ఉత్తర్వులు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ను తాజాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌తో విలీనం చేసింది. సిండికేట్‌ బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌తో విలీనంకాగా, అలహాబాద్‌ బ్యాంక్‌ ఇండియన్‌ బ్యాంక్‌తో కలిసిపోయింది. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం అయ్యాయి. 

ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్‌లో విలీనమయ్యింది. ఐడీబీఐ బ్యాంక్‌ కాకుండా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన 2021–22 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు. రూ.1.75 లక్షల కోట్ల సమీకరణకు ఉద్దేశించి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్‌ విలీన విధానానికి కేంద్రం అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను స్వయంగా ఆర్థికమంత్రి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ, ఎస్‌బీఐ పరిమాణం తరహాలో భారత్‌కు మరికొన్ని దిగ్గజ బ్యాంకుల అవసరం ఉందని పేర్కొంటున్నారు. విలీనాలకు నిరసనగా బ్యాంకింగ్‌ సిబ్బంది సమ్మె సమస్యలను ప్రస్తావిస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటున్నారు. పైన పేర్కొన్న ఆరు(ఎస్‌బీఐ,బీఓబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాం క్, ఇండియన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సిస్‌బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు