యూపీఐ–క్రెడిట్‌ కార్డు.. చార్జ్‌ పడుద్ది!

15 Jun, 2022 01:59 IST|Sakshi

ఎండీఆర్‌ లేకుండా లాభసాటి కాదంటున్న పరిశ్రమ 

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై సున్నా చార్జీ 

క్రెడిట్‌కార్డు యూపీఐ చార్జీలపై బ్యాంకుల కసరత్తు 

త్వరలో స్పష్టత వచ్చే అవకాశం 

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)కు క్రెడిట్‌ కార్డు లింక్‌ చేసుకుని చెల్లింపులు చేసుకునే విధానాన్ని అనుమతించాలి ఆర్‌బీఐ జూన్‌ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. తొలుత రూపే కార్డులను అనుసంధానానికి అనుమతిస్తారు. ఆ తర్వాత అన్ని రకాల క్రెడిట్‌ కార్డులను యూపీఐ వేదికలకు లింక్‌ చేసుకుని చెల్లింపులు చేసుకోవచ్చు.

ఇప్పటివరకు కేవలం బ్యాంకు ఖాతాలకే యూపీఐ అనుసంధానం పరిమితం అయింది. ఏ చెల్లింపు అయినా నేరుగా బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ నుంచే వెళుతోంది. చెల్లింపుల పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ఆర్‌బీఐ కొత్త విధానానికి అనుమతించింది. అయితే.. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు అన్నీ ఉచితం. ఎటువంటి చార్జీల్లేవు. కానీ, యూపీఐ క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై మాత్రం రుసుములు వర్తిస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు. ప్రస్తుతం పీవోఎస్‌ ద్వారా చేసే అన్ని కార్డు చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌)ను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇది 1–1.5% వరకు ఉంటోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో ఉంటోంది. ఆర్‌బీఐ తాజా విధానంతో అవి ఆదాయాన్ని కోల్పోయేందుకు సుముఖంగా లేవు. కాకపోతే చిన్న వర్తకులకు ఎండీఆర్‌లో సబ్సిడీ ఇవ్వొచ్చని పేమెంట్‌ పరిశ్రమకు చెందిన సీనియర్‌ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. 

వాణిజ్య నమూనా ఉండాల్సిందే..   
‘‘యూపీఐ కేవలం పేమెంట్‌ సాధనమే కాదు. అదొక లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌. వాణిజ్య నమూనా లేకుండా బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తాయి? పేమెంట్‌ సాధనాలకు జీరో చార్జీలనే ప్రభుత్వం చెప్పింది. రుణ ఉత్పత్తులకు కాదు. చార్జీలు లేకుండా ఇది అయితే మనుగడ సాగించలేదు. వాణిజ్య నమూనా తప్పకుండా ఉండాల్సిందే. ఆ వాణిజ్య నమూనా తమకు అనుకూలమైతే వర్తకులు క్రెడిట్‌కార్డు లావాదేవీలను స్వీకరిస్తారు’’ అని పరిశ్రమకు చెందిన సీనియర్‌ ఉద్యోగి పేర్కొన్నారు.

లావాదేవీ విలువలో నిర్ణీత శాతాన్ని ఫీజుగా వసూలు చేసేదే ఎండీఆర్‌. వర్తకులకు చెల్లింపుల సదుపాయం కల్పించినందుకు బ్యాంకులు ఈ రూపంలో చార్జీ వసూలు చేస్తుంటాయి. రూపే డెబిట్‌ కార్డులు, రూ. 2,000 వరకు యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో రూ.1,300 కోట్లు సమకూర్చింది. బ్యాంకులకు ఎండీఆర్‌ చార్జీలను ప్రభుత్వం చెల్లించింది.

ఆ తర్వాత 2019 డిసెంబర్‌లో పూర్తిగా తీసేసింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయం నిజంగా వినూత్నమైనేదనని, డిజిటల్‌ చెల్లింపుల పరిధిని విస్తృతం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ముందు బ్యాంకులు ఆర్‌బీఐ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) నుంచి స్పష్టత తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయి.  

లక్ష్యం నెరవేరుతుందా..? 
యూపీఐ క్రెడిట్‌కార్డు లావాదేవీలపై చార్జీల గురించి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవిశంకర్‌ను ప్రశ్నించగా ‘‘బ్యాంకులు, వ్యవస్థలోని భాగస్వాములు కలసి చార్జీలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మేము ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నాం. ధరలు ఎలా ఉంటాయో చూడాలి’’అని సమాధానమిచ్చారు. యూపీఐ చెల్లింపులపై ప్రస్తుతం ఎటువంటి ఎండీఆర్‌ లేదు.

డెబిట్‌ కార్డు లావాదేవీలపై 0.9 శాతం ఎండీఆర్‌ను వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. క్రెడిట్‌ కార్డులకు సంబంధించి ఎండీఆర్‌పై పరిమితుల్లేవు. సాధారణంగా డెబిట్‌ కార్డు లావాదేవీల విలువలో ఎండీఆర్‌ 0.5 శాతం మించదు. అదే క్రెడిట్‌కార్డుల లావాదేవీల విలువలో ఎండీఆర్‌ 2 శాతం వరకు ఉంటోంది. అలాగే రూపే (ఎన్‌పీసీఐ ఆవిష్కరణ) డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎండీఆర్‌ లేదు. రూపే క్రెడిట్‌కార్డు లావాదేవీలపై ఎండీఆర్‌.. వీసా/మాస్టర్‌ కార్డుల కంటే తక్కువ. సాధారణంగా ఎండీఆర్‌ చార్జీలో కార్డును ఇష్యూ చేసిన బ్యాంకు 0.60 శాతం తీసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని నెట్‌వర్క్‌ ప్రొవైడర్, చెల్లింపులు స్వీకరించిన బ్యాంకు పంచుకుంటాయి.  

బూస్ట్‌ వంటిది..  
‘‘క్రెడిట్‌కార్డు–యూపీఐ లింకేజీ ఆర్థిక వ్యవస్థకు  ఊతమిస్తుంది. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థ కస్టమర్‌ సొంత డబ్బు నుంచే చెల్లింపులకు అనుమతిస్తోంది. ఇప్పుడు కస్టమర్‌ లెండర్స్‌ (క్రెడిట్‌ కార్డు రూపంలో రుణ సదుపాయం) డబ్బుతో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 20–40 లక్షల వర్తకులు క్రెడిట్‌ కార్డు చెల్లింపులను అనుమతిస్తున్నారు. ఇకపై యూపీఐ పరిధిలోని 5 కోట్ల మంది క్రెడిట్‌కార్డు ఆర్థిక వ్యవస్థలో భాగం అవుతారు. ఇది వినియోగాన్ని భారీగా పెంచుతుంది’’అని చెల్లింపుల పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి తెలిపారు. 

మరిన్ని వార్తలు