ఆర్బీఐ కీలక నిర్ణయం... స్టాక్‌ మార్కెట్‌లో అనూహ్య మార్పులు

6 Aug, 2021 11:15 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం వెలువరించిన మరుక్షణం స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతోంది. రెపోరేటు, రివర్స్‌ రేపో రేటులలో మార్పులు ఉండబోవంటూ ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నిర్ణయం ప్రకటించిన వెంటనే స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కలిసిరావడంతో తిరిగి మార్కెట్‌ కోలుకుంటోంది.

పాజిటివ్‌ ట్రెండ్‌
ఈ వారం ప్రారంభం నుంచి స్టాక్‌మార్కెట్‌లో పాజిటివ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. వరుసగా ప్రతీ రోజు ఇన్వెస్టర్లు లాభాలు కళ్లజూస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా అయితే సెన్సెక్స్‌, నిఫ్టీలు రికార్డులు సృష్టించాయి. ఆల్‌టైం హైలకు చేరుకున్నాయి. ఈవారంలో మార్కెట్‌కి చివరి రోజైన శుక్రవారం సైతం సెన్సెక్స్‌ స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఆ వెంటనే పుంజుకుంది. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి నిఫ్టీ లాభాల బాటలోనే పయణించింది.

గంటలోనే
ఈరోజు ఉదయం 54,492 పాయింట్లతో సెన్సెక్స్‌ మొదలైంది. ఓ దశలో గరిష్టంగా 54,663 పాయింట్లను తాకింది. ఈ సమయంలో రిపోరేటు, రివర్స్‌ రిపోరేటుపై ఆర్బీఐ  నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్‌ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఆర్బీఐ నుంచి ప్రకటన  వెలువడిన మరుక్షణమే  దేశీ సూచీలు లాభాల నుంచి నష్టాల దిశగా దారి మార్చుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన గంట వ్యవధిలోనే 205 పాయిం‍ట్లు నష్టపోయి 54,287 వద్ద సెన్సెక్స్‌  ట్రేడయ్యింది.  మరికాసేపటికే కోలుకుంది. ఉదయం 11 గంటల సమయంలో 88 పాయింట్ల నష్టంతో 54,403 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

నిఫ్టీ సైతం
నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ ఈ రోజు ఉదయం 16,304 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 16,336 పాయింట్లకు చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి పాయింట్లు కోల్పోవడం మొదలైంది.  గంట వ్యవధిలో 41 పాయింట్లు నష్టపోయి 16,253 వద్ద ట్రేడయ్యింది. అయితే కాసేపటికే పుంజుకుంది. ఉదయం 11;30 గంటల సమయంలో 24 పాయింట్లు నష్టపోయి 16,270 వద్ద ట్రేడవుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు