ఆర్‌బీఐ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలు కీలకం

4 Oct, 2021 00:06 IST|Sakshi

అంతర్జాతీయ పరిణామాలపైనా దృష్టి

8న టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల బోణీ

మరిన్ని రోజులు స్థిరీకరణకు అవకాశం

ఈ వారం స్టాక్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ద్రవ్య పాలసీపై ఆర్‌బీఐ నిర్ణయాలతో పాటు ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌ ఇండెక్స్, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ కదలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్‌ సూచీల ఐదువారాల వరుస లాభాలకు గతవారం బ్రేక్‌ పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్ల పతనంతో ఆ వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1,283 పాయింట్లు, నిఫ్టీ 321 పాయింట్లను కోల్పోయాయి. అయితే ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఇంధన, మెటల్, ఆటో షేర్లలకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

‘‘ఈ వారంలోనూ మార్కెట్‌ స్థిరీకరణ జరగవచ్చు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ సెపె్టంబర్‌ దిద్దుబాటు ప్రభావం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్రూడాయిల్, కమోడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం భయాలు తెరపైకి వచ్చాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు యోచనలు చేస్తున్నాయి. ఫెడ్‌ ట్యాపరింగ్, చైనాలో తాజాగా నెలకొన్న సంక్షోభాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశాలు ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అయితే దేశీయ కార్పొరేట్ల రెండో ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండొచ్చనే విశ్లేషకుల అంచనాలు కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జూలియస్‌ బేయర్‌ ఇండియా ఎండీ ఉన్మేష్‌ కులకర్ణి తెలిపారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే...

అందరి చూపు ఆర్‌బీఐ వైపు ...
భారత కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమావేశం బుధవారం(అక్టోబర్‌ 6న) ప్రారంభమవుతుంది. గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ శుక్రవారం పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే క్రూడాయిల్‌ ధరలు పెరుగుదల, కోవిడ్‌ పరిస్థితులు అదుపులోకి రావడం, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్‌బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.

8న టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల బోణీ...
కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌ ఆరంభమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌(జూలై–సెపె్టంబర్‌) ఫలితాలను అక్టోబర్‌ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చే వారం 13న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే రోజున (అక్టోబర్‌ 13న) వెలువడతాయి.

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం...
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరుకు ఆరు మాసాల్లో తొలి రెండు మినహా మిగతా నాలుగు నెలల్లో సేవారంగం మెరుగైన పనితీరు కనబరించింది. ఈ వారాంతాన శుక్రవారం ఆర్‌బీఐ సెప్టెంబర్‌ 24వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్‌ రుణ వృద్ధి గణాంకాలతో పాటు అక్టోబర్‌ 1వ వారంతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు.

రెండో నెలలోనూ కొనుగోళ్లు...
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. భారత మార్కెట్లో ఈ సెప్టెంబర్‌ మాసంలో రూ.26,517 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.13,154 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.13,363 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, చైనాలో అనిశి్చతుల ప్రభావంతో ఎఫ్‌ఐఐలు ఇటీవల భారత్‌తో పాటు ఇతర వర్థమాన దేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ‘‘కోవిడ్‌ తర్వాత దీర్ఘకాలపు ప్రయోజనాల దృష్ట్యా భారత్‌ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదైతే ఎఫ్‌ఐఐలు తిరిగి దేశంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని మారి్నంగ్‌స్టార్‌ ఇండియా డెరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

మరిన్ని వార్తలు