గ్రాము సార్వభౌమ బంగారం ధర ఎంతంటే!

16 May, 2022 21:05 IST|Sakshi

సార్వభౌమ బంగారం బాండ్‌ (ఎస్‌జీబీ) 2016–17 సిరీస్‌ 3లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు విక్రయించాలని అనుకుంటే గ్రాము ధరను రూ.5,115గా ఆర్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీజీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. కాకపోతే ఐదేళ్లు నిండిన తర్వాత నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తుంది. 

ఈ క్రమంలో ఎస్‌జీబీ 2016–17 సిరీస్‌ 3 ఇష్యూని 2016 నవంబర్‌ 17న ఇష్యూ చేయగా.. 2021 నవంబర్‌ 17తో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఐదేళ్లు ముగిసిన అనంతరం రెండో విడత ఉపసంహరణకు ఆర్‌బీఐ అవకాశం కల్పిస్తోంది. 2022 మే 17వ తేదీ నుంచి ఉపసంహరించుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. గత వారం రోజుల బంగారం సగటు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఎస్‌జీబీ రిడెంప్షన్‌ రేటును ఆర్‌బీఐ ఖరారు చేసింది. 2016లో ఇష్యూ ధర గ్రాము రూ.2,957గా ఉండడం గమనార్హం.
  
కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్‌జీబీలను ఆర్‌బీఐ జారీ చేస్తుంటుంది. భౌతిక బంగారంలో పెట్టుబడులను డిజిటల్‌ వైపు మళ్లించేందుకు కేంద్ర సర్కారు తీసుకొచ్చిన వినూత్న పెట్టుబడి పథకం ఇది. ఎస్‌జీబీలో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. 8 ఏళ్ల పాటు పెట్టుబడిని ఉంచి గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే వచ్చే లాభంపై పూర్తి పన్ను మినహాయింపు కూడా ఉంది.     

మరిన్ని వార్తలు