ప్రైవేటు బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ గవర్నర్‌...!

26 May, 2021 01:04 IST|Sakshi

ముంబై: బ్యాలెన్స్‌ షీట్ల పటిష్టతపై దృష్టి సారించి, ఇందుకు సంబంధించి తగిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని ప్రైవేటు రంగ బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆదేశించారు. ఒడిదుడుకులు తట్టుకునేలా బ్యాలెన్స్‌ షీట్స్‌ ఉండాలని సూచించారు. వ్యక్తులు, వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలుసహా వివిధ ఫైనాన్షియల్‌ సేవలు అన్నింటికీ తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటురంగ బ్యాంకర్లతో గవర్నర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం సమావేశ వివరాలపై ఒక ప్రకటన వెలువడింది. ప్రకటన ప్రకారం, మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా ఆర్‌బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను సత్వరం అమలు చేయాలని సూచించారు.

దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్‌ రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్‌ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్‌బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత సవాళ్లలో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను గవర్నర్‌ ప్రశంసించారు.  సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు  ఎంకే జైన్, ఎం రాజేశ్వర రావు, మైఖేల్‌ డీ పాత్ర, టీ రబి శంకర్‌ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్‌ వ్యవస్థీకరణ,  వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు,  టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్‌ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలను ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు