బలహీన విధానాలతోనే బ్యాంకింగ్‌ సంక్షోభం

28 Apr, 2023 04:17 IST|Sakshi

అమెరికాలో పరిణామాలకు ఇదే కారణం

బలంగానే దేశీయ బ్యాంకులు

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్‌ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే.

ఈ క్రమంలో శక్తికాంతదాస్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్‌బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్‌ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్‌ ఈ అంశంపై మాట్లాడారు.

‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్‌ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్‌ బ్యాంకింగ్‌లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్‌ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్‌ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే.

మరిన్ని వార్తలు