నోట్ల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలి

29 Mar, 2022 04:06 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

నోట్ల తయారీ ఇంక్‌ యూనిట్‌

‘వర్ణిక’ జాతికి అంకితం  

ముంబై: నోట్ల తయారీలో సమీప కాలంలో భారత్‌ 100 శాతం స్వయం సమృద్ధిని సాధించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఉద్ఘాటించారు. మైసూరులో       భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌) ఏర్పాటు చేసిన ఇంక్‌ తయారీ యూనిట్‌–  ‘వర్ణిక’ను జాతికి అంకితం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ,  ఈ యూనిట్‌తో  నోట్ల తయారీ వ్యవస్థలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించినట్లైందన్నారు.  దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి గణనీయంగా తగ్గనుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోట్ల తయారీలో 100 శాతం స్వయం సమృద్ధిని సాధించేందుకు నిరంతర     (సుశిక్షత మానవ వనరులు, ప్రక్రియ,            సాంకేతికత, సామర్థ్యం పరంగా) పరిశోధన,      అభివృద్ధి, ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు.  

ఎల్‌డీసీకి శంకుస్థాపన...
కాగా,  బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఎల్‌డీసీ)కు కూడా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ, దేశంలోని కరెన్సీ ఉత్పత్తి, ఈ విభాగంలో  మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎల్‌డీసీ ఏర్పాటు ఎంతో కీలకమవుతుందని అన్నారు. ఈ కేంద్రం గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించనుందని కూడా తెలిపారు.

వర్ణిక ప్రత్యేకతలు...
ఆర్‌బీఐ నియంత్రణలోని బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌ నోట్ల భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించి వర్ణికాను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ వార్షిక ఇంక్‌ తయారీ సామర్థ్యం 1,500 మెట్రిక్‌ టన్నులు. కలర్‌ షిఫ్ట్‌ ఇంటాగ్లియో ఇంక్‌ (సీఎస్‌ఐఐ)ని కూడా వర్ణిక తయారు చేస్తుంది. భారతదేశంలోని బ్యాంక్‌ నోట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ల పూర్తి అవసరాలను తీరుస్తుంది. దీని ఫలితంగా బ్యాంక్‌ నోట్‌ ఇంక్‌ ఉత్పత్తిలో వ్యయాలు తగ్గుతాయి.  సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా ఈ విషయంలో దేశం ఎంతో స్వయం సమృద్ధి సాధించినట్లయ్యింది.  ఈ యూనిట్‌ ఏర్పాటు  ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ చొరవకు ఊతమిస్తోందని, నోట్ల ప్రింటింగ్‌ ఇంక్‌ను అవసరమైన పరిమాణంలో దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్‌ ఊతం ఇస్తుందని  ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.  

మరిన్ని వార్తలు