బ్యాలెన్స్‌ షీట్స్‌ పటిష్టతపై కార్పొరేట్లు దృష్టి పెట్టాలి

10 Jun, 2022 13:33 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

న్యూఢిల్లీ: కార్పొరేట్లు తమ బ్యాలెన్స్‌ షీట్స్‌ పటిష్టతపై దృష్టి సారించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలు తమ బ్యాలెన్స్‌ షీట్‌లలో అధిక నష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, స్వల్పకాలిక రివార్డ్‌ కోరే సంస్కృతిని విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘రిస్క్‌ తీసుకోవడం’ అనేది వ్యాపారం చేయడంలో కీలకమైన అంశమని గవర్నర్‌ పేర్కొంటూనే.. అయితే కంపెనీలు ఆయా అంశాలు, పర్యావసానాలు అన్నింటిపై జాగ్రత్తగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. స్వల్పకాలిక రివార్డ్‌ కోరుకోవడానికన్నా ముందు వ్యాపారంలో ఎదరవబోయే ప్రతికూల అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం, వాటి నివారణకు తగిన చర్యలకు సిద్ధమవడం అవసరమని అన్నారు. 

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ సెంట్రల్‌ బోర్డ్‌  (సీబీఐసీ) ఆధ్వర్యంలో జరిగిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ఐకానిక్‌ వీక్‌ వేడుకలో ‘ఇండియన్‌ బిజినెస్‌: పాస్ట్, ప్రెజెంట్‌ అండ్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించి త్వరలో నియంత్రణా నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే... 

- ఆర్‌బీఐ దృష్టికి వచ్చిన కొన్ని అనుచితమైన వ్యాపార నమూనాలు లేదా వ్యూహాల సాధారణ లక్షణాలను పరిశీలిస్తే అవి ప్రధానంగా అనుచితమైన ఫండింగ్‌ స్ట్రక్చర్, రుణం– ఆస్తుల అసమతుల్యతను కలిగి ఉన్నాయి.  ఇది అత్యంత ప్రమాదకరమైనవి. స్థిరమైనవి ఎంతమాత్రం కాదు.  
- వీటితోపాటు అవాస్తవిక వ్యూహాత్మక అంచనాలు, సామర్థ్యాలు– వృద్ధి అవకాశాలు–మార్కెట్‌ పోకడల గురించి మితిమీరిన ఆశావాదం వ్యాపార నమూనా సాధ్యతను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి చివరకు పేలవమైన వ్యూహాత్మక నిర్ణయాలకు దారితీస్తుంది.  
- వ్యాపార దీర్ఘకాలిక విజయాన్ని నిర్ణయించే ఏకైక అతి ముఖ్యమైన అంశం– కార్పొరేట్‌ గవర్నెన్స్‌. వ్యాపార సంస్థలలో విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం ఇవన్నీ కార్పొరేట్‌ గవర్నెన్స్‌తో ముడివడి ఉంటాయి.  దీర్ఘకాలిక పెట్టుబడి, వ్యాపార స్థిరత్వం, సమగ్రతను పెంపొందించడంలో కార్పొరేట్‌ గవర్నర్స్‌ కీలక పాత్ర పోషిస్తుంది.  
- యునికార్న్‌ల సంఖ్య  (బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కొత్త వ్యాపారాలు)  చాలా వేగంగా పెరుగుతోంది. ఈ స్టార్టప్‌లకు ఏంజెల్, వెంచర్‌ ఫండింగ్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్‌లు, సమాజంలో వినియోగానికి సంబంధించి కొత్త సంస్కృతి ద్వారా మద్దతు లభిస్తోంది.  
- భారతీయ వ్యాపారం ఇప్పుడు అవకాశాలు– సవాళ్లు రెండింటితో కీలకమైన దశలో ఉంది.  
- స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.    

చదవండి: భారత జీడీపీ వృద్ధి: వరల్డ్‌ బ్యాంకు షాకింగ్‌ అంచనాలు

మరిన్ని వార్తలు