Shaktikanta Das: కోత  లేదు.. పెంచేదీ లేదు! 

2 May, 2021 10:23 IST|Sakshi

వరుసగా నాలుగో ‘సారీ’! అయితే ‘సరళతర’ ధోరణికే మొగ్గు

ధరల స్పీడ్‌ తగ్గుతుందన్న అంచనాలే కారణం

ఎకానమీ వెనకచూపు లేదు

సాక్షి, ముంబై: ఆర్థికవేత్తలు,నిపుణుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు-రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కడి రేటు అక్కడే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి.  ప్రస్తుతం రెపో 4 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్‌ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్‌ నెలల్లో) మూడు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది.

అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్‌బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గు చూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ  శుక్రవారమూ ఏకగ్రీవంగా ఇదే విధానాన్ని పునరుద్ఘాటించింది. తద్వారా వృద్ధికి తగిన మద్దతు ఆర్‌బీఐ నుంచి ఉంటుందని స్పష్టం చేసింది.  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌ తరువాత, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ  (ఎంపీసీ) నిర్వహించిన మొట్టమొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఇది.

ఏప్రిల్‌లో తదుపరి సమీక్ష : ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎంపీసీ 28వ తదుపరి సమావేశం జరుగుతుంది.   
మే నాటికి సీఆర్‌ఆర్‌ 4 శాతానికి ‘రివర్స్‌’ : కాగా, రెపో రేటును తగ్గించని ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులు తమ  వద్ద ఉన్న మిగులు నిధులను తన వద్ద డిపాజిట్‌ చేసినప్పుడు  ఇందుకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా 3.35 శాతంగానే కొనసాగుతుందని తన తాజా పాలసీలో ఆర్‌బీఐ స్పష్టంచేసింది. ఫిబ్రవరి తర్వాత ఈ రేటు కూడా 155 పాయింట్లు తగ్గి, 4.9 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చింది. ఇక బ్యాంకులు తమ నిధుల్లో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద నిర్వహించాల్సిన మొత్తం క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (సీఆర్‌ఆర్‌)ను మార్చి 27 నాటికి 3.5 శాతానికి, మే 22 నాటికి 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ పాలసీ ప్రకటించింది. ప్రస్తుతం సీఆర్‌ఆర్‌ 3 శాతంగా ఉంది. అంటే బ్యాంకుల వద్ద ప్రస్తుతం ఉన్న నిధుల్లో మరికొంత మొత్తం ఆర్‌బీఐకి చేరుతుందన్నమాట. తద్వారా తన వద్దకు తిరిగి వచ్చే  ‘మరిన్ని’ నిధులను ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌కు అలాగే ఇతర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) చర్యలకు సెంట్రల్‌ బ్యాంక్‌ వినియోగించ నుంది.  

డిసెంబర్‌ నాటికి 4.3 శాతానికి ద్రవ్యోల్బణం
ఆర్‌బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2021–22 ఏప్రిల్‌–సెప్టెంబర్‌) సగటున ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది. మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) 4.3 శాతానికి దిగివస్తుంది. ఇదే కారణంగా కీలక రేటు విధానం సరళతరంగా ఉంచడానికే ఆర్‌బీఐ మొగ్గుచూపుతోంది. అంటే వడ్డీరేట్లు వ్యవస్థలో మరింత తగ్గడానికే అవకాశం ఉంది తప్ప, పెంచే యోచనలేదని భావించవచ్చు.  

ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్‌ దన్ను! 
భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఒకేఒక్క దిశలో.. అదీ పురోగమన బాటలో ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. 2021–22లో ఎకానమీ 10.5% వృద్ధిని (ఎకనమిక్‌ సర్వే 11% కన్నా తక్కువ కావడం గమనార్హం)  నమోదు చేసుకుంటుందన్న భరోసాను ఆయన ఇచ్చారు. మౌలిక రంగం, ఆరోగ్యం వంటి కీలక రంగాల పునరుత్తేజానికి ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తగిన చర్యలను ప్రకటించిందని తెలిపారు. ఆయా అంశాల దన్నుతో 2021–22 మొదటి ఆరు నెలల్లో వృద్ధి 26.2%–8.3% శ్రేణిలో ఉంటుందని, 3వ త్రైమాసికంలో 6% వృద్ధి నమోదవుతుందని తెలిపింది.

బ్యాంకులకు నిధుల లభ్యత: అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ ఆర్‌బీఐ నుంచి నిధులు పొందడానికి సంబంధించిన మార్జినల్‌ స్టాండింగ్‌ సౌలభ్యత (ఎంఎస్‌ఎఫ్‌)ను ఆర్‌బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. దీనివల్ల రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చి నుంచీ ఈ పొడిగింపులను ఆర్‌బీఐ కొనసాగిస్తోంది.  
 
ఆలోచనాపూర్వక పాలసీ : వృద్ధికి మద్దతు, రుణ నిర్వహణ, ద్రవ్య లభ్యత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఆలోచనాపూర్వక పాలసీ ఇదీ.   వృద్ధే లక్ష్యంగా రూపొందించిన 2021-22 బడ్జెట్‌తో కలిసి తాజా విధాన నిర్ణయాలు కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి.
- దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌  

రియల్టీకి ప్రయోజనం..  వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు తగిన నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకుంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు టీఎల్‌టీఆర్‌ఓ ప్రయోజనాలను  విస్తరించడం రియల్టీసహా ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న పలు రంగాలకు  దోహదపడుతుంది. తక్కువ వడ్డీరేట్ల వల్ల హౌసింగ్‌ రంగంలో డిమాండ్‌ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
- శశిధర్‌ బైజాల్, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ 

రికవరీ పటిష్టతకు దోహదం : ఇప్పటికే ఎకానమీ రికవరీ వేగవంతమైంది. సెంట్రల్‌ బ్యాంక్‌ తాజా పాలసీ నిర్ణయాలు ఈ రికవరీ బాటను మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నాం.చిన్న  పరిశ్రమలకు ద్రవ్య లభ్యతకు పాలసీ తగిన నిర్ణయాలను తీసుకోవడం హర్షణీయం. సరళ విధానాన్ని  పునరుద్ఘాటించడం వృద్ధికి భరోసాను ఇచ్చే అంశం.
- ఉదయ్‌ శంకర్, ఫిక్కీ ప్రెసిడెంట్‌  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు