Digital Banking Units: డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లకు లైన్‌ క్లియర్‌, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!

8 Apr, 2022 07:56 IST|Sakshi

ముంబై: రోజులో 24 గంటల పాటు ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను బ్యాంకులు ప్రారంభించుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 75జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 75డిజిటల్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడం తెలిసిందే. 

ఖాతాలు తెరవడం, నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, కేవైసీ నవీకరించడం, రుణాల మంజూరు, ఫిర్యాదుల నమోదు సేవలను డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల ద్వారా అందించొచ్చంటూ ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. కస్టమర్లను చేర్చుకోవడం దగ్గర్నుంచి, వారికి సేవలు అందించడం వరకు కస్టమర్లే స్వయంగా పొందడం, లేదా సహాయకుల విధానంలో అందించొచ్చని పే ర్కొంది.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్‌ అన్నది కనీస మౌలిక సదుపాయాలతో, డిజిటల్‌ రూపంలో సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన వసతిగా అర్థం చేసుకోవచ్చు. డిజిటల్‌ బ్యాంకింగ్‌లో అనుభవం కలిగిన షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు అనుమతి అవసరం లేకుండానే టైర్‌–1 నుంచి టైర్‌–6 వరకు పట్టణాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను తెరుచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.

మరిన్ని వార్తలు