Cryptocurrency: ఆర్బీఐ ఆందోళన.. నిర్ణయం కేంద్రం పరిధిలో

10 Sep, 2021 10:22 IST|Sakshi

ఎకానమీ వృద్ధి 9.5 శాతం!

2021–22పై ఆర్‌బీఐ ఆశావాదం 

రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగివస్తుందన్న విశ్వాసం  

ముంబై: బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐకి తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నట్లు కూడా గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్రానికి తెలిపినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్‌ స్థిరత్వ కోణంలో ఈ అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తోందని అన్నారు.  ఇక దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం కేంద్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు.  రెండు ఆంగ్ల పత్రికలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో శక్తికాంత్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఎకానమీ వృద్ధిరేటు
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతంగా నమోదవుతుందన్న విశ్వాసాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యక్తం చేశారు.  వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత  రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా క్రమంగా 4 శాతానికి దిగివస్తుందన్న ధీమాను కూడా ఆయన వెలిబుచ్చారు. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అని ఆయన అన్నారు.

►సెకండ్‌వేవ్‌ తర్వాత సడలించిన ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందన్న సంకేతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పలు ఇండికేటర్ల నుంచి సానుకూల గణాంకాలు వెలువడుతున్నాయి.  

►ప్రతి త్రైమాసికం అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఎకానమీ పురోగమిస్తోంది. జూన్‌ త్రైమాసికంకన్నా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పరిస్థితులు మరింత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నాం.  

►ద్విచక్ర వాహనాలు, పాసిజర్‌ కార్ల అమ్మకాలు పెరిగాయి. జీఎస్‌టీ, ఈ–వే బిల్లుల తీరు బాగుంది. విద్యుత్‌ వినియోగం, ట్రాక్టర్‌ అమ్మకాల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ ఎకానమీకి శుభ సూచికలే.  

►ఇప్పుడు ఆందోళనఅంతా మూడవ వేవ్‌ రావచ్చన్న విశ్లేషణల వల్లే. ఇటువంటి సంక్షోభాలను, అవాంతరాలను తట్టుకొని ఎలా నిలబడాలన్న అంశాన్ని ఇంకా వ్యాపార సంస్థలు నేర్చుకోలేదు.  

►రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నుంచి నిర్దేశం. ఈ శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని భావిస్తున్నాం. ఈ అంశాన్ని అత్యంత జాగరూకతతో పరిశీలిస్తున్నాం.  

►అధిక కమోడిటీ ధరలు, సరఫరాల్లో సమస్యలు ఇంకా ద్రవ్యోల్బణాన్ని ఎగువన ఉంచుతున్నాయి. ఈ అంశాల్లో సవాళ్లును ఎలా ఎదుర్కొనాలన్న అంశాలపై ప్రభుత్వంతో నిరంతరం ఆర్‌బీఐ చర్చిస్తుంది. వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు తగ్గించడానికి కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది.  

►సెకండ్‌వేవ్‌ సవాళ్లు వచ్చినప్పటికీ, జూన్‌ త్రైమాసికంలో మొండి బకాయిలు స్థిరంగా ఉన్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో 7.5 శాతం స్థూల ఎన్‌పీఏలు ఉంటే, నాన్‌– బ్యాంకింగ్‌ విషయంలో ఇది ఇంతకన్నా తక్కువగా ఉంది.  

►దివాలా కోడ్‌ పనితీరు మరికొంత మెరుగుపడాలన్న వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఇందుకు కొన్ని చట్ట సవరణలు చేయాలి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి  క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్‌ ప్రణాళికలను ఆమోదిస్తున్న ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.   

ఎకానమీ, ద్రవ్యోల్బణం తీరిది...
కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ,  2021–22 మొదటి జూన్‌ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సెకండ్‌వేవ్‌ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్‌బీఐ, ఐఎంఎఫ్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్‌ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్‌ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్‌ రేటింగ్స్‌ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక  రెపోను వరుసగా ఏడు  ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది.  మార్చి 2020 తర్వాత 115 బేసిస్‌ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది.  కోవిడ్‌–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది.

చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్‌ కొంపముంచింది..!

మరిన్ని వార్తలు