RBI Hikes Repo Rate: ఇక వడ్డీరేట్లు పైపైకి!

9 Jun, 2022 04:34 IST|Sakshi

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం

5 వారాల్లో ఆర్‌బీఐ రెండో ‘వడ్డి’ంపు

రెపో రేటు మరో అర శాతం పెంపు

దీంతో 4.9 శాతానికి కీలక వడ్డీరేటు 

రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనా 6.7%కి పెంపు

ఇప్పటికీ 7.2 శాతంగానే ఎకానమీ వృద్ధి

ముంబై: విశ్లేషణలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేవలం ఐదు వారాల వ్యవధిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను మరో అరశాతం పెంచింది. దీనితో ఈ కీలక రేటు 4.9%కి చేరింది. గత నెల 4వ తేదీన ఆర్‌బీఐ అనూహ్యరీతిలో బ్యాంకులకు రెపోను 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెం చింది. దీనితో ఈ రేటు 4.4%కి చేరింది.

మూడురోజుల భేటీ అనంతరం గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో పెంపు నిర్ణయంలో కీలక రేటు  4.9%కి ఎగసింది. మొదటి విడత పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు తమ బెంచ్‌మార్క్‌ రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఈ స్వల్ప వ్యవధిలోనే రెండు దఫాలుగా వడ్డీరేట్లను పెంచాయి. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్‌ గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలు మరింత భారంగా మారనున్నాయి. అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌) మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎండీఎఫ్‌) రేటు అరశాతం పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4.65%, 5.15%కి చేరాయి.  

ద్రవ్యోల్బణంపై అందోళన...
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్‌బీఐ తాజా సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డం గమనార్హం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్‌బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్‌ కట్టడికి సంబంధించి ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) అధికం.

ఏకగ్రీవ నిర్ణయం
6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్షలో ఆరుగురు సభ్యులు 4.9 శాతం వరకూ రేటు పెంపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పాలసీ విధానాన్ని  ‘‘రిమైనింగ్‌ అకామిడేటివ్‌’’ (తగిన ద్రవ్యలభ్యత ఉండే స్థాయి) నుంచి ‘‘ విత్‌డ్రాయెల్‌ ఆఫ్‌ అకామిడేటివ్‌’’ (ద్రవ్యలభ్యత ఉపసంహరణ)కు మార్చుతున్నట్లు పేర్కొన్న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, భవిష్యత్తు చర్యలపై మార్కెట్‌కు మరింత స్పష్టత ఇవ్వాలన్న  లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.  అయితే వృద్ధికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా తగిన చర్యలను అన్నింటినీ ఆర్‌బీఐ తీసుకుంటుందని పాలసీ సమీక్ష స్పష్టం చేసింది.  

వృద్ధి బాట పటిష్టం
కాగా, ఒకవైపు వడ్డీరేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్‌ ఎకానమీ వృద్ధి బాట పటిష్టంగానే ఉంటుందన్న భరోసాను ఆర్‌బీఐ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి నెలకొంటుందన్న క్రితం అంచనాలను మరోసారి పునరుద్ఘాటించింది.  ఏప్రిల్, మే నెలల్లో సూచీలు దేశీయ ఎకానమీ క్రియాశీలత పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష పేర్కొంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు 16.2%, 6.2%, 4.1%, 4.0% వృద్ధి రేట్లు నమోదవుతుందని అంచనా వేసింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్‌ ఎకనామీ మందగమనం వంటి ప్రతికూలతలూ ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్‌బీఐ ఇంతక్రితమే  వృద్ధి రేటును 7.8% నుంచి 7.2%కి తగ్గించిన సంగతి తెలిసిందే.

రిజిస్టర్‌కాని డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌లపై హెచ్చరిక
కాగా, డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌లపై ప్రజల్లో నెలకొంటున్న ఆసక్తి నేపథ్యంలో ఆర్‌బీఐ అప్రమత్తత ప్రకటించింది. ఏదైనా అవకతవకలు జరిగితే రిజిస్టరయిన డిజిటల్‌ యాప్‌లపైనే ఆర్‌బీఐ చర్యలు తీసుకోగలుగుతుందని తెలిపింది. రిజిస్టర్‌ కాని యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది. డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ల ద్వారా వేధింపులు, అవి ఆత్మహత్యలకు దారితీయడం వంటి సంఘటనల నేపథ్యం లో ఆర్‌బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

క్రెడిట్‌ కార్డులకు ‘యూపీఐ’ లింక్‌
క్రెడిట్‌ కార్డులను యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో లింక్‌ చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతించింది. యూపీఐ ప్లాట్‌ఫారమ్‌ వినియోగం విస్తృతికి, ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లింపులు చేయడానికి దోహదపడే చర్య ఇది. ఇప్పటి వరకూ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన డెబిట్‌ కార్డులు మాత్రమే యూపీఐ అనుసంధానమైంది. ముందుగా రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడం ఉచితం.

అయితే క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు సాధారణంగా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌)పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ మార్గంగా  మర్చంట్‌ పేమెంట్స్‌కు సంబంధించి ప్రతి వినియోగంపై ఎండీఆర్‌ చార్జ్‌ ఉంటుంది.  తాజా ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో యూపీఐతో అనుసంధానమయ్యే క్రెడిట్‌ కార్డుల విషయంలో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. మేలో 594.63 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.10.40 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ప్రాసెస్‌ జరిగినట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

ఈ మ్యాండేట్‌ పరిమితి రూ.15,000కు పెంపు
క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ప్రాతిపదికన నిర్వహించే రికరింగ్‌ చెల్లింపుల విషయంలో ఈ–మ్యాండేట్‌ (కస్టమర్‌ ఆమోదం తప్పనిసరి) పరిమితి పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ పరిమితి రూ.5,000 కాగా, దీన్ని రూ.15,000కు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఇక రూ.15,000 లోపు లావాదేవీలకు ఈ–మ్యాండేట్‌ అవసరం లేదన్నమాట.

రియల్టీ మందగమనమే
ఆర్‌బీఐ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. విక్రయాలు తగ్గే పరిస్థితి నెలకొంది. వెరసి సమీప భవిష్యత్తులో రియల్‌ ఎస్టేట్‌ మందగమనంలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు పెంపు తప్పనిసరి అయినప్పటికీ, ఇది రియల్టీ రంగాన్ని రెడ్‌ జోన్‌లోకి    నెట్టేసింది.
– రమేష్‌ నాయర్, కొలియర్స్‌ ఇండియా సీఈఓ

రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్టడి...
2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్‌ బాస్కెట్‌) 105 ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనితోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాం.    మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో పట్టణ నివాసితుల నుంచి కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు మా సర్వేలో తెలిసింది. ఈ పరిస్థితుల్లో  దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గిస్తే,  ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఈ అంచనాలను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది.
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

సహకార బ్యాంక్‌ గృహ రుణ పరిమితి రెట్టింపు
రియల్టీలో సహకార బ్యాంకులు ఇక మరింత క్రియాశీల పాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలకు సంబంధించి సహకార బ్యాంకు ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ మొత్తాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌  రెట్టింపు చేసింది. గృహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దశాబ్ద కాలం క్రితం చేసిన మార్గదర్శకాల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపిన సమాచారం ప్రకారం, పట్టణ గ్రామీణ బ్యాంకుల విషయంలో గరిష్ట రుణ పరిమితి ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెరిగితే, గ్రామీణ సహకార బ్యాంకుల విషయంలో ఈ పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఎగసింది.

డెవలపర్‌లకు ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఆర్‌బీఐ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన బిల్డర్లకు రుణాలు ఇవ్వడానికి గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నిషేధం ఉంది.  గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ – రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ (సీఆర్‌ఈ–ఆర్‌హెచ్‌) రంగానికి రుణాలు ఇవ్వడానికీ ఆర్‌బీఐ అనుమతులు మంజూరు చేయడం ఈ రంగాలకు సానుకూల అంశం.  వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవల నిర్వహణకు అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ తెలపడం మరో విశేషం.

సమగ్ర అంచనాలు...
ఆర్‌బీఐ పాలసీ సమీక్ష అంచనాలు సమగ్రంగా ఉన్నాయి. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని ఆర్‌బీఐ కమిటీ ఎకానమీ పురోగమనానికి తగిన నిర్ణయాలు తీసుకుంది. రియల్టీ రుణాల విషయంలో సహకార బ్యాంకింగ్‌కు తగిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగానికి సానుకూల అంశం.
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌

కీలక దశ...
ఒకపక్క వృద్ధి పురోగమనం. మరోపక్క ద్రవ్యోల్బణం కట్టడి. ఈ కీలక లక్ష్యాల సాధన దిశగా ఎకానమీ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంది. పాలసీ సమీక్ష దాదాపు ఊహించిందే. వృద్ధి బాట చెక్కుచెదరకుండా ప్రభుత్వం, ఆర్‌బీఐ పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం.  
– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

సమతుల్య పాలసీ...
ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పురోగతికి తగిన చర్యలు తీసుకుంటూ ద్రవ్య, పరపతి అధికారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లలో అధికభాగం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తుతున్నవే. ఆర్థికాభివృద్ధికి– ధరల కట్టడికి ఆర్‌బీఐ పాలసీ కమిటీ తన నిర్ణయాలను తాను తీసుకుంది.
– అజయ్‌ సేథ్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి.

మరిన్ని వార్తలు