దిద్దుబాటు చట్రంలో ఉన్న  బ్యాంకులకు రూ.14,500 కోట్లు! 

13 Mar, 2021 00:55 IST|Sakshi

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలో (పీసీఏ) ఉన్న  బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వశాఖ రానున్న కొద్ది రోజుల్లో రూ.14,500 కోట్ల తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు సూచించాయి. ఆయా బ్యాంకుల ఫైనాన్షియల్‌ పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో ఈ తాజా నిధులను అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీఏ పరిధిలో  ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యుకో బ్యాంక్‌లు ఉన్నాయి. రుణాలు, యాజమాన్య పరిహారం, డైరెక్టర్ల ఫీజుల వంటి అంశాల్లో ఆయా బ్యాంకులపై ఆర్‌బీఐ నియంత్రణలు ఉన్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌సహా పలు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ మార్కెట్‌ వనరుల ద్వారా ఇప్పటికే నిధులను సమీకరించుకున్నాయి.  


ఇప్పటికే  రూ.5,500 కోట్లు... 
నియంత్రణా పరమైన అవసరాలకు వీలుగా  ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.20,000 కోట్ల తాజా మూలధనాన్ని ప్రభుత్వం కేటాయించింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌కు గత ఏడాది నవంబర్‌లో రూ.5,500 కోట్లు సమకూర్చింది. కాగా, ఐడీబీఐ బ్యాంక్‌ను తన తీవ్ర నియంత్రణా పర్యవేక్షణా పరిధి  (పీసీఏ) నుంచి ఆర్‌బీఐ రెండు రోజుల క్రితమే తొలగించిన సంగతి తెలిసిందే.  బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ ఊరట)

మరిన్ని వార్తలు