ఆర్థిక సంక్షోభంలో ఈ బ్యాంకులు.. రంగంలోకి దిగిన ఆర్బీఐ

23 Nov, 2021 08:51 IST|Sakshi

పీఎంసీ బ్యాంక్‌ టేకోవర్‌కు ఆర్‌బీఐ స్కీమ్‌ 

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ను యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (యూఎస్‌ఎఫ్‌బీ) టేకోవర్‌ చేసేందుకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ముసాయిదా స్కీమును రూపొందించింది. దీని ప్రకారం పీఎంసీ బ్యాంక్‌కు చెందిన డిపాజిట్లతో పాటు ఆస్తులు, అప్పులను యూఎస్‌ఎఫ్‌బీ తీసుకోనుంది. ఒకవేళ కొత్త బ్యాంకులో కొనసాగరాదని భావిస్తే రిటైల్‌ డిపాజిటర్లు దశలవారీగా నగదును వెనక్కి తీసుకోవచ్చు. ఇక పీఎంసీ బ్యాంక్‌ ఉద్యోగులు అవే వేతనాలు, అవే సర్వీసు నిబంధనల కింద నిర్దిష్ట తేదీ నుంచి మూడేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. ఈ స్కీముతో డిపాజిటర్ల సొమ్ముకు మరింత భద్రత చేకూరగలదని ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై డిసెంబర్‌ 10 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్‌బీఐకు పంపవచ్చు. ఆ తర్వాత ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసి, విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. సెంట్రమ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, రెజిలియెంట్‌ ఇన్నొవేషన్‌ కలిసి ఏర్పాటు చేసిన యూఎస్‌ఎఫ్‌బీ ఈ ఏడాది అక్టోబర్‌లో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ పొందింది. నవంబర్‌ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది.  

చదవండి:మీ పేర్లలో ‘బ్యాంక్‌’ను తగిలించొద్దు

మరిన్ని వార్తలు