పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక నిబంధనలు!

27 Jun, 2022 07:00 IST|Sakshi

ముంబై: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సహా తన నియంత్రణలో ఉన్న ఇతరత్రా సంస్థలు ఆర్థిక, పరపతిపరమైన రిస్కుల్లో పడకుండా చూసేలా..ఐటీ సర్వీసుల అవుట్‌సోర్సింగ్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దిష్ట నిబంధనలను ప్రతిపాదించింది.

వీటి ప్రకారం బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, సహకార బ్యాంకులు, క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు మొదలైనవి బోర్డు ఆమోదిత సమగ్ర ఐటీ అవుట్‌సోర్సింగ్‌ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ కార్యకలాపాలనైనా అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చినంత మాత్రాన సదరు నియంత్రిత సంస్థ (ఆర్‌ఈ) తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కుదరదని, అంతిమంగా ఆయా అంశాలకు సంబంధించి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

అవుట్‌సోర్సింగ్‌ సంస్థ కచ్చితంగా ఆర్‌ఈ ప్రమాణాలతోనే కస్టమర్లకు అందించాల్సి ఉంటుందని, అలా చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్‌ఈదేనని తెలిపింది. బోర్డు .. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పాత్ర, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల వినియోగం, సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌వోసీ) అవుట్‌సోర్సింగ్‌ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను ముసాయిదా ప్రతిపాదనలో ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌ఈలు పటిష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటిపై జూలై 22లోగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు