మెప్పించిన ఆర్‌బీఐ పాలసీ 

9 Dec, 2021 05:04 IST|Sakshi

ఆరునెలల్లో అతిపెద్ద లాభం 

అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లే  

ర్యాలీకి రిలయన్స్‌ అండ 

కలిసొచ్చిన రూపాయి రికవరీ 

ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు 

1,016 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 

17,450 పైకి నిఫ్టీ  

సూచీలు రెండోరోజూ ముందుకే 

ముంబై: ఆర్‌బీఐ కీలకవడ్డీ రేట్లను తొమ్మిదోసారి యథాతథంగా కొనసాగించడం స్టాక్‌ మార్కెట్‌ను మెప్పించింది. ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థిక రికవరీలపై నమ్మకాన్ని ఉంచుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపీ 9.5 శాతం కొనసాగింపూ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం, ప్రపంచ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి.

అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్టాక్‌ సూచీలు బుధవారం భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1,016 పాయింట్లు పెరిగి 58,650 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మార్చి 30 తర్వాత ఈ సూచీకిదే అతిపెద్ద లాభం. నిఫ్టీ 293 పాయింట్లు 17,470 వద్ద నిలిచింది. ఇదే ఏడాది మే 21 తర్వాత ఇరు సూచీల అతిపెద్ద ముగింపు కావడం విశేషం.

ట్రేడిం గ్‌ ఆద్యంతం పటిష్ట కొనుగోళ్లతో సూచీలు స్థిరంగా ముందుకు కదిలాయి. డెల్టా కంటే ఒమిక్రాన్‌ మరీ ప్రమాదకరం కాదని నివేదికలు తెలపడంతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలు తగ్గి  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టినట్లు స్టాక్‌ నిపుణులు తెలిపారు. సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో కోటక్‌ బ్యాంక్, పవర్‌గ్రిడ్‌ షేర్లు మాత్రమే నష్టపోయాయి.

ఇంట్రాడే నష్టాలను పూడ్చుకున్న రూపాయి రెండు పైసలు స్వల్పంగా క్షీణించి 75.46 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.579 కోట్లు ఈక్విటీ షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1735 కోట్ల షేర్లు కొన్నారు.  

రిలయన్స్‌ దూకుడు...
అబుధాబి కెమికల్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ(టాజిజ్‌) భాగస్వామ్యంతో యూఏఈలో 2 బిలియన్‌ డాలర్ల(రూ. 15,000 కోట్లు) పెట్రోకెమికల్‌ ఉత్పాదక ప్లాంటు నిర్మాణాన్ని చేపడతామని కంపెనీ ప్రకటనతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో రూ.2,431 వరకు పెరిగి, చివరికి 1.5% లాభంతో రూ.2417 వద్ద స్థిరపడింది. 

రెండు రోజుల్లో రూ.7.46 లక్షల కోట్లు  
సూచీల ర్యాలీ కొనసాగడంతో స్టాక్‌ మార్కెట్లో ఈ రెండు రోజుల్లో రూ.7.46 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ బుధవారం రూ.3.96 లక్షల కోట్ల మేర పెరిగింది.

అంతకు ముందు మంగళవారం రూ. 3.5 లక్షల కోట్లు జమైన సంగతి తెలిసిందే. తద్వారా బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల విలువ రూ.264 లక్షల కోట్లు చేరింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 1903 పాయింట్లు, నిఫ్టీ 557 పాయింట్లు దూసుకెళ్లాయి.   

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా షేరు 6% పైగా నష్టపోయి 1894 వద్ద ముగిసింది.  
నవంబర్‌లో అంచనాలకు తగ్గట్లే వాహనాలు అమ్ముడైనట్లు డీలర్ల సమాఖ్య(ఫాడా) ప్రకటనతో ఆటో షేర్ల దూసుకెళ్లాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ రెండున్నర శాతం లాభపడింది.   
అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడైన దేవయాని 9% లాభంతో రూ.176 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు