Micro Finance: ఇష్టారీతిగా పెనాల్టీ కుదరదు.. వడ్డీ రేటు అన్యాయంగా ఉండొద్దు - ఆర్బీఐ

15 Mar, 2022 08:11 IST|Sakshi

వడ్డీ రేట్లపై సూక్ష్మ రుణ సంస్థలకే అధికారం 

బోర్డు ఆమోదంతో వడ్డీ రేట్ల విధానం 

అనుమతిస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు 

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి 

ముంబై: సూక్ష్మ రుణ సంస్థలకు వడ్డీ రేట్ల పరంగా స్వేచ్ఛనిస్తూ ఆర్‌బీఐ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లను త్రైమాసికం వారీగా ఆర్‌బీఐ నిర్ణయిస్తూ వచ్చింది. ఇక నుంచి వడ్డీ రేట్లను మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (ఎంఎఫ్‌ఐలు) నిర్ణయించుకునేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం బోర్డు ఆమోదంతో ఒక విధానాన్ని రూపొందించుకోవాలని కోరింది. ఇందులో హెచ్చు వడ్డీలు అమలు చేయకుండా రైడర్‌కు చోటు ఇవ్వాలని నిర్ధేశించింది. వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న వారికి హామీ లేకుండా ఇచ్చే రుణాలను సూక్ష్మ రుణాలుగా ఆర్‌బీఐ నిర్వచనాన్ని సవరించింది. ‘‘సూక్ష్మ రుణాలపై వడ్డీ రేట్లు, ఇతర చార్జీలు/ఫీజులు అన్నవి భారీగా (అన్యాయంగా) ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆర్‌బీఐ సూక్ష్మ పరిశీలనకు లోబడి ఉంటాయి’’ అని తన ఆదేశాల్లో ఆర్‌బీఐ పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి నూతన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. 

నూతన నిబంధనలు.. 
- ప్రతి సూక్ష్మ రుణ సంస్థ (రెగ్యులేటెడ్‌ ఎంటెటీ/ఆర్‌ఈ) చార్జీలకు సంబంధించి సమాచారాన్ని రుణ గ్రహీతలకు ప్రామాణిక విధానంలో, సులభంగా అర్థమయ్యేట్టు తెలియజేయాలి. 
- రుణగ్రహీత నుంచి వసూలు చేసే ఏ చార్జీ అయినా ఫాక్ట్‌షీట్‌ లో తెలియజేయాలి
- సూక్ష్మ రుణాలను నిర్ణీత కాలవ్యవధికి ముందే తీర్చి వేస్తే ఎటువంటి చార్జీ వసూలు చేయకూడదు 
- చెల్లింపులు ఆలస్యం చేస్తే, ఆ మొత్తంపైనే పెనాల్టీ విధించాలి కానీ, రుణం మొత్తంపై అమలు చేయకూడదు
- రుణ గ్రహీత అర్థం చేసుకోతగిన భాషలో రుణ ఒప్పందం పత్రం ఉండాలి

చదవండి:ఎయిర్‌టెల్‌ క్రెడిట్‌ కార్డులు.. ఫైనాన్స్‌ ఇప్పుడెంతో ఈజీ
 

మరిన్ని వార్తలు