ఫీచర్‌ ఫోన్లలో యూపీఐ సర్వీసులు 

9 Mar, 2022 03:42 IST|Sakshi

40 కోట్ల మంది యూజర్లకు ప్రయోజనం 

ప్రారంభించిన ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ 

న్యూఢిల్లీ: ఫీచర్‌ ఫోన్లలోనూ ఏకీకృత చెల్లింపుల విధానాన్ని (యూపీఐ) అందుబాటులోకి తెస్తూ కొత్త సర్వీసును రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మంగళవారం ఆవిష్కరించారు. దీనితో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ మొబైల్‌ ఫోన్ల ద్వారా కూడా డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లభిస్తుంది. బహుళ ప్రయోజనకరమైన యూపీఐ విధానం 2016లోనే ప్రవేశపెట్టినా.. ఇప్పటివరకూ ఇది స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే పరిమితమైందని దాస్‌ తెలిపారు.

అట్టడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలకు యూపీఐ 123పే ప్రయోజనకరంగా ఉంటుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ఫీచర్‌ ఫోన్లకు యూపీఐ సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్‌ చెప్పారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొన్నారు. 2016లోనే ఫీచర్‌ ఫోన్‌ యూజర్ల కోసం కూడా యూఎస్‌ఎస్‌డీ కోడ్‌ ద్వారా పనిచేసే యూపీఐ సర్వీసును అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కష్టతరంగా ఉండటంతో ప్రాచుర్యం పొందలేదు.

దీనితో ఎన్‌పీసీఐ దాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ప్రారంభించడం నుంచి ముగించే వరకూ లావాదేవీ ప్రక్రియ మూడు అంచెల్లో జరుగుతుంది కాబట్టి యూపీఐ 123పే అని బ్రాండ్‌ పేరు పెట్టినట్లు దాస్‌ తెలిపారు. యూపీఐ లావాదేవీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి పరిమాణం రూ. 41 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి ఇప్పటిదాకా రూ. 76 లక్షల కోట్ల స్థాయికి చేరాయని చెప్పారు. ఫిబ్రవరిలోనే రూ. 8.26 లక్షల కోట్ల విలువ చేసే 453 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ‘యూపీఐ ద్వారా లావాదేవీల పరిమాణం రూ. 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదు‘ అని దాస్‌ చెప్పారు.  

నాలుగు ప్రత్యామ్నాయాలు.. 
యూపీఐ కింద.. ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ (ఐవీఆర్‌) నంబర్,  ఫీచర్‌ ఫోన్లలో యాప్‌లు, మిస్డ్‌ కాల్, శబ్ద ఆధారిత చెల్లింపుల విధానాల ద్వారా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు పలు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు .. స్నేహితులకు చెల్లింపులు జరిపేందుకు, కరెంటు..నీటి బిల్లులు కట్టేందుకు, వాహనాల కోసం ఫాస్ట్‌ ట్యాగ్‌ల రీచార్జి, మొబైల్‌ బిల్లుల చెల్లింపులు, ఖాతాల్లో బ్యాలెన్స్‌లను తెలుసుకోవడం మొదలైన అవసరాలకు యూపీఐ 123పే ఉపయోగపడుతుంది.

మరోవైపు, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి ’డిజిసాథీ’ పేరిట ఎన్‌పీసీఐ ఏర్పాటు చేసిన 24 గీ7 హెల్ప్‌లైన్‌ను కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ ప్రారంభించారు. డిజిటల్‌ చెల్లింపులపై తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారం కోసం యూజర్లు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డిజిసాథీ.కామ్‌ని సందర్శించవచ్చు లేదా తమ ఫోన్ల నుంచి 14431, 1800 891 3333కి ఫోన్‌ చేయవచ్చు.    

మరిన్ని వార్తలు