ఆర్‌బీఐ ఉత్కర్ష్‌ 2.0 ఆవిష్కరణ

31 Dec, 2022 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: 2023–25 సంవత్సరాలకు గాను పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళిక ’ఉత్కర్ష్‌ 2.0’ను రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం ఆవిష్కరించారు. నిర్దిష్ట మైలురాళ్లను సాధించేందుకు, విధుల నిర్వహణలో ఆర్‌బీఐ అత్యుత్తమ పనితీరు కనపర్చేందుకు పాటించాల్సిన విధానాలకు ఇది మార్గదర్శిగా ఉండనుంది. 

ఇందులో డేటా విశ్లేషణకు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)ను మరింత విస్తృతంగా వినియోగించనున్నారు. 2023–2025 మధ్య కాలంలో ఆర్‌బీఐ ప్రాధాన్యమివ్వాల్సిన అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ఫలితాలు మొదలైనవి ఉత్కర్ష్‌ 2.0లో ఉంటాయి.  2019–2022 మధ్య కాలంలో తొలి ఉత్కర్ష్‌ ను అమలు చేశారు. అంతర్జాతీయంగా, దేశీయంగా పెను సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత్‌ జీ–20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదే ఉత్కర్ష్‌ 2.0 కూడా ప్రారంభమవుతోందని ఆర్‌బీఐ పేర్కొంది. 

డేటా సేకరణ, సమాచార వెల్లడిలో రిజర్వ్‌ బ్యాంక్‌ రెండు రకాల పాత్రలు పోషించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో అర్థవంతమైన, సరైన సమాచారాన్ని ఇచ్చేందుకు తాను సేకరించే డేటా కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్‌బీఐపై ఉంటుందని వివరించింది. డేటాకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విశ్లేషణ మొదలైన అవసరాల కోసం ఏఐ, ఎంఎల్‌ ఆధారిత సాధనాలను ఉత్కర్ష్‌  2.0లో విస్తృతంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.   


 

మరిన్ని వార్తలు