రెపో రేటు పెంచుతూ ఆర్బీఐ వీర బాదుడు.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా!

1 Oct, 2022 09:07 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును తాజాగా మరో 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ పెంపు నిర్ణయంపై నిపుణుల ఏమంటున్నారంటే..

హర్షణీయం.. 
అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉన్నాయి. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే రీతిలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష దోహదపడుతుంది. వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాలుగా పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. అస్థిర అంతర్జాతీయ వాతావరణంలో అతి చురుకైన, చురుకైన పాలసీ విధానమిది.  
– దినేష్‌ కారత్, ఎస్‌బీఐ చైర్మన్‌  

బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభావం 
పండుగల సీజన్‌ కావడంతో డిమాండ్‌ పరిస్థితులే వ్యవస్థలో కొనసాగవచ్చు. అయితే ఇవే పరిస్థితులు వచ్చే ఏడాది కొనసాగడం కొంత కష్టమైన అంశంమే. ఆయా అంశాలన్నీ బడ్జెట్‌ రూపకల్పనలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కమోడిటీ ధరల పెరుగుదలను ఎదుర్కొనడానికి వ్యాపార సంస్థలు సంసిద్ధంగానే ఉండడం మరో విషయం.      
– సంజీవ్‌ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్‌ 

ఆటో పరిశ్రమకు ప్రతికూలమే 
తాజా పరిణామం ఆటో పరిశ్రమలో డిమాండ్‌ తగ్గుదలకు దారితీస్తుందని భావిస్తున్నాం. ప్రత్యేకించి ద్విచక్ర, పాసింజర్‌ వాహన విక్రయాలపై ఈ ప్రతికూల ప్రభావం పడుతుంది. అధిక ముడి పదార్థాల ధరల వల్ల ద్విచక్ర వాహనాల ధరలు గడచిన ఏడాది కాలంలో 5 సార్లు పెరిగడం గమనార్హం.              
    – మనీష్‌ రాజ్‌ సింఘానియా, ఫెడా 

డిసెంబర్‌లో 0.35 శాతం అప్‌ 
డిసెంబర్‌ పాలసీ సమీక్షాలో రెపో రేటు మరో 0.35 శాతం పెరుగుతుందని భావిస్తున్నాం. కేంద్రం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలోనే ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దిగువకు వచ్చే అవకాశం ఉంది. అటు తర్వాత రేటు పెంపు పక్రియకు ఆర్‌బీఐ కొంత విరామం ఇచ్చే వీలుంది.  
– ఉపాసనా భరద్వాజ్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ 

స్వల్ప ప్రభావమే... 
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాలు మరింత భారంగా మారతాయి. అయితే ఇండ్ల అమ్మాకాలు తక్షణం భారీగా పడిపోయే అవకాశం లేదు. పండుగల సీజన్‌ నేపథ్యంలో పలు డెవలప్పర్లు అనేక డిస్కౌంట్లను ప్రకటించడం దీనికి కారణం. ఇక గృహ రుణ రేట్లు 9 శాతం దిశగా కదిలితే వ్యవస్థలో సెంటిమెంట్‌ కొంత దెబ్బతినే అవకాశం ఉంది.      
    – అనూజ్‌ పురి, అనరాక్‌ చైర్మన్‌   

చదవండి: RBI Monetary Policy: రుణాలు మరింత భారం!

మరిన్ని వార్తలు