ధరలకు కళ్లెం.. వృద్ధికి ఊతం! 

9 Dec, 2021 01:01 IST|Sakshi

సరళతర విధానానికే ఆర్‌బీఐ మొగ్గు

పాలసీ రుణ రేటు.. రెపో యథాతథం

కనిష్ట స్థాయిలో 4 శాతంగా కొనసాగింపు

ఎకానమీకి ‘తొమ్మిదవ’ భరోసా

ధరల స్థిరత్వంపై ధీమా

2021–22లో సగటున 5.3 శాతం

రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనా

9.5% వృద్ధి అంచనా యథాతథం  

ముంబై: ఎకానమీపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం అనిశ్చితి నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలు వెలువడ్డాయి. 3 రోజుల కీలక సమావేశాల్లో గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పాలసీ కమిటీ యథాతథ  పాలసీ రేటు కొనసాగింపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో యథాతథంగా రికార్డు కనిష్ట స్థాయి 4%గానే ఉంటుందని బుధవారం ప్రకటించింది.   

వృద్ధి, ద్రవ్యోల్బణం... సానుకూలం 
2021–22 ఆర్థిక సంవత్సరంలో ధరలు కట్టడిలో ఉంటూనే... స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.5 శాతంగా కొనసాగుతుందన్న భరోసానే సరళతర ఆర్థిక విధానం కొనసాగింపునకు ప్రధాన కారణమని పాలసీ విధానం సూచిస్తోంది. తద్వారా 2021–22లో 9.5% వృద్ధి నమోదవుతుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. ఎకానమీ మొదటి, రెండు త్రైమాసికాల్లో 20.1 శాతం, 8.4 శాతంగా నమోదుకాగా, మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.6 శాతం, 6 శాతంగా ఉంటాయని అంచనావేసింది.  ఇక ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 5.1 శాతం, 5.7 శాతంగా ఉంటుందని అంచనావేసింది. 2022–23 క్యూ1, క్యూ2లలో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. ఆర్‌బీఐ పాలసీ సమీక్షకు రిటైల్‌ ద్రవ్యోల్బణం కదలికలు ప్రాతిపదిక కావడం తెలిసిందే. ఈ రేటు 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది.  

9 సమావేశాల నుంచి యథాతథం 
రెపో రేటును ఆర్‌బీఐ ఎంపీసీ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2019 ప్రారంభం నుంచి 135 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1%) రుణ రేటును తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్టకాలం నేపథ్యంలో 2020 మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో 2020 ఆగస్టునాటికి రెపో రేటు రికార్డు కనిష్టం 4%కి దిగివచ్చింది.   

అదనపు లిక్విడిటీకి వీఆర్‌ఆర్‌ఆర్‌ మందు 
కాగా, అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీని) వెనక్కు తీసుకునే విషయంలో రివర్స్‌ రెపో రేటును కాకుండా, వీఆర్‌ఆర్‌ఆర్‌ (వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో) ఆక్షన్‌ను ఆర్‌బీఐ సాధనంగా ఎంచుకుంది. ఎస్‌డీఎఫ్‌తో పోల్చితే వీఆర్‌ఆర్‌ఆర్‌ మరింత మార్కెట్‌ స్నేహపూర్వకమైనది కావడమే తన నిర్ణయానికి కారణమని ఆర్‌బీఐ తెలిపింది.  బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేసిన పొందే వడ్డీరేటు (రివర్స్‌రెపో)ను యథాతథంగా 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.  లిక్విడిటీ పరిస్థితుల సమతౌల్యతను సెంట్రల్‌ బ్యాంక్‌ కొనసాగిస్తుందని తెలిపింది. 

డిజిటల్‌ కరెన్సీలోనూ సవాళ్లు... 
కాగా, సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ఆవిష్కరణ నేపథ్యంలో గవర్నర్‌ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మోసాలు ఈ కొత్త వ్యవస్థలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లుగా ఉంటాయని అన్నారు. ఈ విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంద న్నారు. వచ్చే ఏడాది కొంత మేర పైలెట్‌ ప్రాతిపదికన డిజిటల్‌ కరెన్సీ వ్యవస్థ ప్రారంభానికి ఆర్‌బీఐ కసరత్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. 2021 చివరి నాటికే సీబీడీసీ సాఫ్ట్‌లాంచ్‌ ఉంటుందని అంతక్రితం దాస్‌ సంకేతాలు ఇచ్చారు.  

మరిన్ని ముఖ్యాంశాలు... 
     ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండా విదేశీ శాఖలలో మూలధనం పెంపునకు, అలాగే లాభాలను స్వదేశానికి తరలించడానికి బ్యాంకింగ్‌  నిబంధనల సరళతరం.  
     వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ తదుపరి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం.  

మా విధానం.. పురోగతికి ఉత్ప్రేరకం: దాస్‌ 
సరళతర ఆర్థిక విధానాలకు వోటేస్తూ, ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం వృద్ధి పటిష్టతకు బాటలు వేస్తుందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. పాలసీ అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  కోవిడ్‌–19 మూడో వేవ్‌ ముప్పును ఎదుర్కొనడం నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్యతాంశాలకు పాలసీ విధానం పెద్ద పీట వేసిందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం దాదాపు 5%గా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరఫరాల సమస్యలు లేకుండా చూడ్డం, ఇంధన ధరలు తగ్గడం, చక్కటి పంట దిగుబడి దీనికి కారణమని అన్నారు.2021–22లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.3% ఉంటుందని అంచనావేసిన ఆయన, 2022–23 చివరకు 4–4.3% శ్రేణికి తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ తగ్గింపు రవాణా ఖర్చులను తగ్గిస్తాయని ఇది ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిత స్థాయిలో (2–6%) నిలబెడతాయని విశ్లేషించారు.

సానుకూల సంకేతం 
ఊహించిన విధంగానే పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌లోటు వంటి స్థూల ఆర్థిక అంశాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలోనూ కీలక పాలసీ రేటు యథాతథంగా కొనసాగించడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. డిజిటల్‌ పేమెంట్లు పెరిగేందుకు చర్యలు హర్షణీయం. 
– ఏకే గోయెల్, ఐబీఏ చైర్మన్‌ 

కీలక నిర్ణయాలు 
ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సరళతర విధానం కొనసాగింపుతోపాటు ఆర్‌బీఐ ముందస్తు అనుమతి లేకుండా విదేశీ శాఖలలో మూలధనం పెంపునకు బ్యాంకింగ్‌కు వెసులుబాటు, డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించి కస్టమర్లపై విధిస్తున్న చార్జీలను సమీక్ష, యూపీఐ చెల్లింపుల పెరగడానికి చర్యలు వంటి అంశాలు ఇందులో కీలకమైనవి. డిజిటలైజేషన్‌ విస్తృతికి ఈ చర్యలు దోహదపడతాయి. 
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌

గృహ రుణ డిమాండ్‌కు ఊతం 
తాజా ఆర్‌బీఐ పాలసీ విధానం గృహ డిమాండ్‌లో రికవరీ కొనసాగడానికి దోహదపడుతుంది. రియల్టీ మార్కెట్‌కు నిర్ణయాలు ఊతం ఇస్తాయి.  
– హర్షవర్థన్‌ పటోడియా, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌  
 

మరిన్ని వార్తలు