RBI Monetary Policy: రెపో పెంపుతో ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందిలేదు

10 Feb, 2023 04:54 IST|Sakshi

ఇక్రా నివేదిక

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పెంచడం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోదని ఇక్రా రేటింగ్స్‌ తన తాజా నివేదికలో పేర్కొంది.  రెపో రేటును ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం పావుశాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్‌ 8, ఆగస్టు 5, సెప్టెంబర్‌ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్‌ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది.  ఎన్‌బీఎఫ్‌సీపై రేటు పెంపు  ప్రభావం విషయంలో ఇక్రా రేటింగ్స్‌ తాజా నివేదికలో ముఖ్యాంశాలు..

► రెపో రేటు పెరుగుదల ఎన్‌బీఎఫ్‌సీ వసూళ్ల సామర్థ్యాలను ప్రభావితం చేయదు. రుణగ్రహీతలు ఇచ్చిన పూచీకత్తులు, వారు తిరిగి చెల్లింపులకు ఇచ్చే ప్రాధాన్యతను ఇక్కడ ప్రాతిపతికగా తీసుకోవడం జరిగింది.  
► ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పలు రంగాలపై ఈ ప్రభావాన్ని ప్రస్తుతం నిర్ధారించడం కష్టంగా ఉన్నప్పటికీ, మెజారిటీ రంగాల అవుట్‌లుక్‌ పటిష్టంగానే ఉంది. ఇది ఎన్‌బీఎఫ్‌సీల రుణ వసూళ్ల సామర్థ్యానికి సానుకూల అంశం.  
► అందుతున్న గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  మొదటి తొమ్మిది నెలలకు (2022–23, ఏప్రిల్‌–డిసెంబర్‌)  నాన్‌–బ్యాంకు ఫైనాన్స్‌ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వసూళ్ల సామర్థ్యం  97–105 శాతం శ్రేణిలో ఉంది.  
► అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, పెరుగుతున్న వడ్డీరేట్ల నేపథ్యంలోనూ వస్తున్న ఈ సానుకూల గణాంకాలు ఆర్థిక పటిష్టతను సూచిస్తున్నాయి.  
► పటిష్ట రుణ వసూళ్ల సామర్థ్యం కొనసాగడం వల్ల  ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉంటుంది. సానుకూల బ్యాంకింగ్‌ నిర్వహణా పరిస్థితులకు ఇది దారితీస్తుంది.  
► మహమ్మారి కారణంగా అంతరాయం కలిగిన రెండు సంవత్సరాల తర్వాత నాన్‌–బ్యాంకింగ్‌ కార్యకలాపాలు తిరిగి ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి.  
► కోవిడ్‌ సమయంలో తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొన్న వ్యక్తులు, వ్యాపారాలకు ప్రస్తుతం తిరిగి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సజావుగా అందుతోంది. పటిష్ట దేశీయ వృద్ధి ధోరణి దీనికి నేపథ్యం. 

మరిన్ని వార్తలు