యూపీఐ పేమెంట్‌ సిస్టమ్‌లోనూ ఛార్జీలు? ఎటూ తేల్చని బ్యాంకుల పెద్దన్న!

8 Dec, 2021 14:08 IST|Sakshi

RBI Monetary Policy | UPI for Feature Phone Users: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక ప్రకటన చేశారు. ఫీచర్‌ ఫోన్లకు సైతం(స్మార్ట్ ఫోన్లు కాకుండా బేసిక్‌ ఫోన్లు) యూపీఐ ఆధారిత పేమెంట్‌ పద్దతులను.. అదీ ఆర్బీఐ పర్యవేక్షణ నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తద్వారా చిన్నాచితకా ట్రాన్‌జాక్షన్లు జరిగే అవకాశం ఉందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

ఇదిలా ఉంటే యూపీఐ ఆధారిత ఫీచర్‌ ఫోన్‌ ప్రొడక్టులు ఎలా పని చేయనున్నాయనేది ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పేమెంట్‌ వ్యవస్థలో డిజిటల్‌ ట్రాన్‌జాక్షన్స్‌ తీరును మరింత సరళీకరించే ఉద్దేశంతో ఆర్బీఐ ఉంది. ఇందుకోసం కార్డులు, వాలెట్లు, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఛార్జీల మీద చర్చా పత్రాన్ని విడుదల చేయబోతోంది. కార్డులు, వాలెట్ల వరకు ఓకే. కానీ, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన బేసిక్‌ పేమెంట్‌ యాప్స్‌ ఏవీ ఇప్పటివరకు పేమెంట్ల మీద పైసా ఛార్జీ వసూలు చేయలేదు. దీంతో భవిష్యత్తులో గూగుల్‌ పే, ఫోన్‌ పే లాంటి యాప్‌ ఆధారిత డిజిటల్‌ చెల్లింపుల మీద ఛార్జీలు వసూలు చేస్తారా? అనే కోణంలో చర్చ మొదలైంది. 

మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌
ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో యూపీఐ మోస్ట్‌ పాపులర్‌ పేమెంట్‌ మెథడ్‌గా ఉంది. ఒక్క నవంబర్‌లోనే 4.1 బిలియన్ల ట్రాన్‌జాక్షన్స్‌ ద్వారా 6.68 లక్షల కోట్లు యూపీఐ ద్వారా జరిగింది. ప్రస్తుతం యూపీఐ పరిధిలోని గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే ఏవీ కూడా ట్రాన్‌జాక్షన్స్‌కి యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ, నాన్‌ యూపీఐ పరిధిలోని కొన్ని మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 

ఇంకోవైపు యూపీఐ పరిధిలోని ప్లేయర్స్‌(గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటివి).. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు విధించాలని ఎప్పటి నుంచో ఆర్బీఐను డిమాండ్‌ చేస్తున్నాయి. తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి.  ఫోన్‌ ఫే ఫౌండర్‌ సమీర్‌ నిగమ్‌ గతంలో ఓ సదస్సులో మాట్లాడుతూ.. యూపీఐ పరిధిలోని ప్లేయర్స్‌ ‘జీరో ఎండీఆర్‌’తోనే 85 నుంచి 90 శాతం ట్రాన్‌జాక్షన్స్‌ చేస్తున్నాయని ప్రస్తావించారు. మరి ఆర్బీఐ యూపీఐ ప్లేయర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా?.. ఒకవేళ తీసుకుంటే డిజిటల్‌ ట్రాన్‌జాక్షన్స్‌పై సామాన్యుల మీదే భారం వేస్తుందా? ఆ చర్చా పత్రంలో ఎలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? అనే విషయాలపై బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

చదవండి: ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేస్తే బాదుడే.. ఎప్పటినుంచంటే..

మరిన్ని వార్తలు