తప్పని పరిస్థితుల్లోనే నగదు ముద్రణ

10 Jun, 2021 02:45 IST|Sakshi
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు,

అటువంటి ప్రత్యక్ష పరిస్థితిని భారత్‌ ఎప్పుడూ ఎదుర్కొనలేదు

కోవిడ్‌ బాండ్ల జారీపై ప్రస్తుతం దృష్టి సారించవచ్చు

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నగదును ప్రత్యక్షంగా ముద్రించి ప్రభుత్వానికి ద్రవ్య పరమైన మద్దతు అందించవచ్చని మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అయితే ఇక ప్రత్యామ్నాయంలేని తప్పని పరిస్థితుల్లోనే ఈ తరహా ప్రత్యక్ష నగదు ముద్రణ విధానాన్ని అవలంభించాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు.  ఈ తరహా పరిస్థితిని భారత్‌ ఎప్పుడూ ఎదుర్కొనలేదని కూడా వివరించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్‌ బాండ్ల జారీ అంశాన్ని కేంద్రం పరిశీలించవచ్చని సూచించారు. దేశం కరోనా సవాళ్లలో ఉన్న నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి అభిప్రాయాలు ఇవీ...

కోవిడ్‌ బాండ్లతో ప్రయోజనం
ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం కరోనా బాండ్ల జారీ ద్వారా రుణ సమీకరణ అంశాన్ని పరిశీలించవచ్చు. బడ్జెట్‌లో పేర్కొన్న రుణ సమీకరణ ప్రణాళికకు అదనంగా... ‘కోవిడ్‌ బాండ్ల ద్వారా నిధుల సమీకరణగా’ దీనిని పరిగణించవచ్చు.  మార్కెట్‌ సమీకరణలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కోవిడ్‌ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లకు స్వల్పంగా అదనపు వడ్డీ ఇవ్వడం ద్వారా పొదుపరులను కోవిడ్‌ బాండ్లతో ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. మనీ సప్లై, ఆర్‌బీఐ ద్రవ్య లభ్యతా చర్యలకు దీనివల్ల ఎటువంటి అవరోధం ఏర్పడదు.  

‘లాభాలు’... ఆర్‌బీఐ ధ్యేయం కాదు
ప్రభుత్వ ద్రవ్య ఒత్తిడులను ఎదుర్కొనడానికి ఆర్‌బీఐ మరిన్ని లాభాలను ఆర్జించడంపై దృష్టి పెట్టవచ్చు అనుకోవడం సరికాదు. ఎందుకంటే సెంట్రల్‌ బ్యాంక్‌ వాణిజ్య సంస్థ కాదు. లాభార్జన దాని ధ్యేయాల్లో ఒకటి కాదు. తన కార్యకలాపాల్లో భాగంగానే ఆర్‌బీఐ కొంత లాభాలను ఆర్జిస్తుంది. ఇందులో తన వ్యయాలు పోను ‘మిగిలిన లాభాన్ని’’ కేంద్రానికి బదలాయిస్తుంది. తన వద్ద ఎంత మొత్తం ఉంచుకోవాలన్న అంశాన్ని బిమల్‌ జలాన్‌ కమిటీ సూచించింది. 2021–22 బడ్జెట్‌ అంచనాలకు మించి రెండు రెట్లు రూ.99,122 కోట్లను కేంద్రానికి ఆర్‌బీఐ బదలాయించిన సంగతి తెలిసిందే.  మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆర్‌బీఐ గడచిన ఏడాదిగా క్రియాశీలంగా, వినూత్నంగా వివిధ చర్యలను తీసుకుంటోంది.  

ఇప్పుడు ముద్రణ జరుగుతోంది,  కానీ..
తన లోటును ప్రభుత్వం తగిన మార్గాల ద్వారా భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉత్పన్నమయినప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రత్యక్ష నగదు ముద్రణ వైపు మొగ్గుచూపవచ్చు. అయితే భారత్‌ ఎప్పుడూ ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనలేదు.  ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి ఆర్‌బీఐ నగదు ముద్రణ చేయాలనే వారు ఒక విషయాన్ని గుర్తించడంలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఇప్పుడు కూడా నగదు ముద్రణ జరుపుతోంది. అయితే ఇది పరోక్ష నగదు ముద్రణా విధానం. ఉదాహరణకు ఆర్‌బీఐ తన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌(ఓఎంఓ) కింద బ్యాంకర్ల నుంచి బాం డ్లను కొనుగోలు చేస్తుంది. లేదా విదేశీ మారకద్రవ్య నిల్వల(ఫారెక్స్‌) ఆపరేషన్ల కింద డాలర్లను కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులకు ఆర్‌బీఐ ముద్రణ జరుపుతుంది.

ప్రత్యక్ష మనీ ప్రింట్‌తో ఇబ్బందులు
ఇక ప్రభుత్వ ద్రవ్య లోటును భర్తీ చేయడానికి కరెన్సీ ప్రత్యక్ష ముద్రణకు పైన పేర్కొన్న దానితో పూర్తి వైరుధ్యం ఉంది. ఇక్కడ కరెన్సీ ముద్రణ ఎప్పుడు ఎంత జరగాలన్న అంశం ప్రభుత్వ రుణ ప్రణాళిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది.  ద్రవ్య సరఫరాపై ఆర్‌బీఐ తన నియంత్రణలను  కోల్పోతుంది. దీనితోపాటు అటు ఆర్‌బీఐ ఇటు ప్రభుత్వ విశ్వసనీయ పరిస్థితులు కోల్పోయే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి కీలక మౌలిక ఆర్థిక గణాంకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఫెడ్, ఈసీబీలతో పోల్చకూడదు...
సవాళ్లను ఎదుర్కొనడంలో ఆర్‌బీఐ వంటి వర్థమాన దేశాల సెంట్రల్‌ బ్యాంకులకు, అమెరికా ఫెడరల్‌ బ్యాంక్, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వంటి ధనిక దేశాల సెంట్రల్‌ బ్యాంకులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఒక సమస్యను ఎదుర్కొనడానికి ప్రత్యక్ష మనీ ప్రింట్‌సహా  ఎటువంటి సాంప్రదాయేత నిర్ణయమైనా తీసుకోగలుగుతాయి. మనకు అటువంటి సౌలభ్యమైన పరిస్థితి ఉండబోదు. దీనికితోడు వర్థమాన దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తీసుకున్న మితిమీరిన నిర్ణయాలను మార్కెట్లు సహించబోవు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు