ఆర్‌బీఐ చర్యలతో ధరల స్పీడ్‌ తగ్గుతుంది

17 May, 2022 06:36 IST|Sakshi

చక్కటి రుతుపవనాలూ ఇందుకు దోహదపడతాయి

సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌  

న్యూఢిల్లీ: బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  తీసుకున్న నిర్ణయం దీనితోపాటు మంచి రుతుపవన పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని పరిశ్రమల సంఘం– సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. సీఐఐ– కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌గా ఫిన్‌సర్వ్‌ సీఎండీ కూడా అయిన సంజీవ్‌ బజాజ్‌ గత వారం బాధ్యతలు స్వీకరించారు.

2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యనభ్యసించారు. బోర్డ్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), అలియాంజ్‌ ఎస్‌ఈ ఇంటర్నేషనల్‌ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు.  సీఐఐ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తన మొట్టమొదటి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► మనం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థలోకి మారామని నేను నమ్ముతున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. మొత్తంగా కాకపోయిన, కనీసం దానిలో కొంత భాగమైనా కట్టడి జరుగుతుందని భావిస్తున్నాను.  
► ద్రవ్యోల్బణం కట్టడి, అవసరమైనమేరకు వడ్డీ రేట్ల కదలికలపై విధాన రూపకర్తల నిర్ణయాలు,  దీనికితోడు బలమైన రుతుపవనాలపై ఆశల వంటి పలు అంశాలు ఈ సంవత్సరం ద్వితీయార్థం నాటికి మనల్ని మంచి స్థానంలో ఉంచుతాయని భావిస్తున్నాను.  
► ద్రవ్యోల్బణం పెరుగుదల రెండు అంశాలపై ప్రస్తుతం ఆధారపడి ఉంది. అందులో ఒకటి డిమాండ్‌. మరొకటి సరఫరా వైపు సవాళ్లు.  
► సెంట్రల్‌ బ్యాంక్‌ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంపు ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే సంవత్సరంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని మనం భావించాలి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల వల్ల వృద్ధికి కలిగే విఘాతాలను సెంట్రల్‌ బ్యాంక్‌ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై మనం దృష్టి పెట్టాలి. ఈ అంశానికి సంబంధించి మేము ఆర్‌బీఐ నుండి స్పష్టమైన దిశను ఆశిస్తున్నాము. తదుపరి ద్రవ్య విధాన సమీక్షలో సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి ఈ మేరకు ప్రకటనలు వెలువడతాయని భావిస్తునాము.  
► అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4–8.2 శాతం శ్రేణిలో ఉంటుందని సీఐఐ అంచనావేస్తోంది.  
► 2022–23కి సంబంధించి ‘బియాండ్‌ ఇండియా @75: పోటీతత్వం, వృద్ధి, సుస్థిరత, అంతర్జాతీయీకరణ’ అన్న థీమ్‌ను సీఐఐ అనుసరిస్తుంది. ఆయా అంశాలపై దృష్టి సారిస్తుంది.  
► ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి,  ప్రపంచ ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నుంచి బయటపడ్డానికి కేంద్రం బలమైన విధాన సంస్కరణలతో ముందుకు నడవాలని మేము సూచిస్తున్నాము.  
► ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు, వ్యవస్థలో బలమైన డిమాండ్, పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), వ్యవసాయ రంగం తోడ్పాటు వంటి అంశాలు దేశ ఎకానమీకి సమీప కాలంలో తోడ్పాటును అందిస్తాయని విశ్వసిస్తున్నాం.  
► ఇంధన ఉత్పత్తులపై పన్నులను కొత్త తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తక్షణం కొంత కట్టడి చేయవచ్చు. పెట్రోల్,  డీజిల్‌ రిటైల్‌ ధరలలో పన్నుల వాటా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిపై పన్ను తగ్గింపునకు సంబంధించి కేంద్రం– రాష్ట్రాలు సమన్వయంతో కృషి చేయాలని సీఐఐ కోరుతోంది.  
► 2026–27 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లు, 2030–31 నాటికి 9 ట్రిలియన్‌ డాలర్ల మైలురాళ్లతో 2047 నాటికి అంటే భారత్‌కు స్వాతంత్యం వచ్చి 100 ఏళ్లు వచ్చేనాటికి దేశం 40 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం.  
► భారత్‌ వృద్ధికి సేవలు, తయారీ రెండు యంత్రాల వంటివి. ప్రభుత్వ సానుకూల విధానాలు ముఖ్యంగా పీఎల్‌ఐ పథకం వంటి చర్యలు 2047–48 ఆర్థిక సంవత్సరం నాటికి తయారీ రంగాన్ని బలోపేత స్థానంలో నిలబెడతాయని ఆశిస్తున్నాం. జీడీపీలో ఈ రంగం వాటా 27 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం.  
► ఇక సేవల రంగం వాటా కూడా జీడీపీలో 55 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం.

2047 నాటికి అప్పటి సమాజం, సమాజ అవసరాలపై పరిశ్రమ ప్రధానంగా దృష్టి పెట్టాలి.  ఫిన్‌టెక్,  ఇ–కామర్స్‌ మొదలైన డిజిటల్‌ విప్లవ అంశాలు భారతీయ పరిశ్రమకు అపారమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి.  ఆయా అంశాలు సమాజ అవసరాలను తీర్చడానికి భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాయి.  ఇవన్నీ ‘‘భారతదేశం  ః100’’ ఎజెండాలో అంతర్భాగంగా ఉంటాయి.
     –  సంజీవ్‌ బజాజ్‌ 

మరిన్ని వార్తలు