6 నుంచి ఆర్‌బీఐ సమీక్ష

31 Mar, 2022 05:33 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి మూడు రోజులు జరగనుంది. ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే  వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) మొత్తం ఆరు ద్వైమాసిక సమావేశాలు జరుగుతుండగా, వచ్చే వారం తొలి సమావేశం జరుగుతుంది. సమావేశాల అనంతరం 8వ తేదీన ఎంపీసీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి.   గవర్నర్‌ నేతృత్వంలోని ఎంపీసీ కమిటీలోని మిగిలిన ఐదుగురిలో ఇద్దరు సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి నేతృత్వం వహిస్తారు.

మరో ముగ్గురు స్వతంత్య్రంగా వ్యవహరించే ఇండిపెండెంట్‌ సభ్యులు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి, ఫిబ్రవరిల్లో 6 శాతంపైగా ద్రవ్యోల్బణం నమోదయ్యింది.   ఆర్‌బీఐ వృద్ధే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో)ను కొనసాగిస్తోంది. ఈ దఫా కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే యథాతథ వడ్డీరేటు కొనసాగింపు 11వ సారి అవుతుంది.

>
మరిన్ని వార్తలు