ఆర్‌బీఐ ఏం చేస్తుందో..!

7 Jun, 2022 04:26 IST|Sakshi

పాలసీ సమావేశాలు ప్రారంభం; రేపు కీలక నిర్ణయాలు

మరోసారి రేటు పెంపు ఖాయమంటున్న విశ్లేషకులు

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 35 బేసిస్‌ పాయింట్ల నుంచి 50 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం)  వరకూ పెంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్‌బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణం. ఇదే పెంపు ధోరణిని ఆర్‌బీఐ తాజా సమావేశంలోనూ కొనసాగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపో రేటు 5.6 శాతం వరకూ పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. మే మధ్యంతర సమావేశంలో రెపో రేటుతోపాటు బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కూడా (రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోవడం లక్ష్యంగా) పరపతి విధాన కమిటీ 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది.

కొనసాగుతున్న బ్యాంకింగ్‌ ‘వడ్డింపు’  
ఆర్‌బీఐ రెపో పెంపు నేపథ్యంలో బ్యాంకింగ్‌ పలు దఫాలుగా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టాయి. తాజాగా సోమవారం ఈ వరుసలో కెనరా  బ్యాంక్, కరూర్‌ వైశ్యా బ్యాంకులు నిలిచాయి. నెలవారీ చెల్లింపుల (ఈఎంఐ) ఆధారిత బెంచ్‌మార్క్‌ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 

మరిన్ని వార్తలు