కోపరేటివ్‌లపై రాజకీయ పెత్తనానికి చెక్‌

26 Jun, 2021 09:11 IST|Sakshi

అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకుల నిబంధనల్లో మార్పు

కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ 

ముంబై: పట్టణ సహకార బ్యాంకుల (అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు) విషయంలో ప్రమాణాలను బలోపేతం చేస్తూ ఆర్‌బీఐ పలు నూతన నిబంధనలను తీసుకొచ్చింది. అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకుల ఎండీలు, హోల్‌టైమ్‌ డైరెక్టర్ల (డబ్ల్యూటీడీలు) విషయంలో అర్హత ప్రమాణాలను పటిష్టం చేసింది. ఈ పోస్ట్‌లకు ఎంపీలు, ఎంఎల్‌ఏలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలకమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటించింది. అలాగే, స్థానిక పాలక మండళ్ల సభ్యులు, వ్యాపారంలో ఉన్నవారు, ఏదైనా కంపెనీతో సంబంధం ఉన్నవారు కూడా అనర్హులుగా నిర్దేశించింది. ఎండీ, డబ్ల్యూటీడీ పోస్ట్‌లకు కనీసం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లేదా ఫైనాన్స్‌లో అర్హత ఉండాలని నిబంధన విధించింది. చార్టర్డ్‌/కాస్ట్‌ అకౌంటెంట్, ఎంబీఏ (పైనాన్స్‌) లేదా బ్యాంకింగ్, కోపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లోమా కలిగి ఉండాలని పేర్కొంది. 35–70 ఏళ్ల వయసు పరిమితిని ప్రవేశపెట్టింది. అంతేకాదు కనీసం ఎనిమిదేళ్ల పని అనుభవం కూడా ఉండాలని ప్రతిపాదించింది. కనీసం రూ.5,000 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ నియమించుకోవడం తప్పనిసరి చేస్తూ ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  

చదవండి: జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్‌ రుణాలు

మరిన్ని వార్తలు