ఆర్‌బీఐ పాలసీ ఇక మార్కెట్లకు దిక్సూచి

28 Nov, 2020 15:55 IST|Sakshi

వచ్చే వారం పరపతి సమీక్షను చేపట్టనున్న ఆర్‌బీఐ

క్యూ2 జీడీపీ, ద్రవ్యోల్బణ గణాంకాలకు ప్రాధాన్యం

సోమవారం మార్కెట్లకు సెలవు- ట్రేడింగ్‌ నాలుగు రోజులే

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 13,150 వద్ద రెసిస్టెన్స్‌- 12,750 వద్ద సపోర్ట్‌!

ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్షను చేపట్టడనుండంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించవచ్చని తెలియజేశారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్న మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్‌ 4న(శుక్రవారం) నిర్ణయాలు ప్రకటించనుంది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే మెరుగ్గా రికవర్‌కావడాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణతను చవిచూసింది. కోవిడ్‌-19 కారణంగా లాక్‌డవున్‌ల అమలు, పలు వ్యవస్థలు స్థంభించడం తదితర ప్రతికూలతతో క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో జీడీపీ 23.9 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. ఇక అక్టోబర్‌లో మౌలిక పరిశ్రమలు 2.5 శాతం నీరసించాయి. వరుసగా 8వ నెలలోనూ వెనకడుగులో నిలిచాయి. వీటికితోడు రిటైల్(సీపీఐ)‌, హోల్‌సేల్‌ ధరల(డబ్ల్యూపీఐ) గణాంకాలు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలలో ప్రధానంగా ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆర్‌బీఐ లక్ష్యమైన 6 శాతానికి ఎగువన సీపీఐ, 2 శాతానికంటే అధికంగా డబ్ల్యూపీఐ నమోదవుతుండటం గమనించదగ్గ అంశమని తెలియజేశారు. ఇప్పటికే ఆర్‌బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 1.15 శాతంమేర తగ్గించిన సంగతి తెలిసిందే.

ఆటో అమ్మకాలు
సోమవారం గురునానక్‌ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. నవంబర్‌ నెలకుగాను మంగళవారం(డిసెంబర్‌ 1న) వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. పండుగల సీజన్‌లో భాగంగా నవంబర్‌లోనూ అమ్మకాలు మెరుగ్గా నమోదుకావచ్చని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. 
 
ఎఫ్‌ఐఐల అండ
ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం!

సాంకేతికంగా..
శుక్రవారం(27)తో ముగిసిన వారంలో సెన్సెక్స్‌ 267 పాయింట్లు పుంజుకుని 44,150 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు బలపడి 12,969 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు మార్కెట్లను మించుతూ 2-4 శాతం చొప్పున జంప్‌చేశాయి. కాగా.. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 13,040 పాయింట్ల దిగువనే నిలిచింది. ఈ స్థాయి దాటితే నిఫ్టీకి 13,150 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,750 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు