నేటి నుంచి 3 రోజుల పాటు ఆర్బీఐ కీలక సమావేశం

4 Aug, 2021 07:43 IST|Sakshi

ముంబై:రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం మూడు రోజుల పాటు అంటే 6వ తేదీ వరకూ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. శుక్రవారం కమిటీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. 

మూడవ వేవ్‌ భయాలు, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శ్రేణికి మించి నమెదుకావడం వంటి అంశాల నేపథ్యంలో తాజా సమావేశం జరగనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4%) కమిటీ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 కోవిడ్‌ నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం ఉండడం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి  కారణం. రెపోను వరుసగా 6  ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది.  మార్చి 2020 తర్వాత 115 బేసిస్‌ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది.

మరిన్ని వార్తలు