RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు

21 Sep, 2023 21:27 IST|Sakshi

అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది.

(20 శాతం ట్యాక్స్‌.. అక్టోబర్‌ 1 నుంచే..)

బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు.

ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. 
 
ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు బదిలీ చేయడానికి ముందు 'విల్‌ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్‌ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.

మరిన్ని వార్తలు