ఆర్బీఐ కీలక నిర్ణయం, ఆశ్చర్యపోయిన నిర్మలా సీతారామన్‌!

9 May, 2022 15:00 IST|Sakshi

ముంబై: పాలసీ రేట్లను పెంచాలన్న ఆర్‌బీఐ నిర్ణయం కన్నా..అందుకోసం  ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వడ్డీ రేట్ల పెంపు వల్ల నిధుల సమీకరణ వ్యయాలు పెరిగినా.. ప్రభుత్వం తలపెట్టిన ఇన్‌ఫ్రా పెట్టుబడుల ప్రణాళికలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత తొలిసారిగా స్పందించిన మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆర్‌బీఐ రేట్లను పెంచుతుంది అన్నది అందరూ ఊహిస్తున్నదే. కాకపోతే అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చింది. రెండు ఎంపీసీ (ద్రవ్య పరపతి విధాన కమిటీ) సమావేశాలకు మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చింది‘ అని ఆమె తెలిపారు.  

రేట్ల పెంపు విషయంలో ఆర్‌బీఐ గత ఎంపీసీ సమావేశంలోనే సంకేతాలు ఇచ్చిందని, అంతర్జాతీయంగా ఇతర ప్రధాన సెంట్రల్‌ బ్యాంకుల తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమని మంత్రి వివరించారు. ‘ఇటీవలి కాలంలో సెంట్రల్‌ బ్యాంకుల మధ్య అవగాహన మరింతగా పెరిగింది. ఒక రకంగా అవన్నీ ఒకదానితో మరొకటి కలిసికట్టుగా పని చేస్తున్నాయి.

ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు పెంచింది. ఆర్‌బీఐ పెంచిన రోజు రాత్రే అమెరికా కూడా పెంచింది. అయితే, మహమ్మారి ప్రభావం నుంచి కోలుకునే ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న అంశం అర్థం కావడం లేదు. ఈ సమస్య కేవలం భారత్‌కు మాత్రమే ప్రత్యేకం కాదు. అంతర్జాతీయంగా అన్ని చోట్లా ఇలాగే ఉంది‘ అని ఆమె చెప్పారు. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ తొలిసారిగా ఈ ఏడాది మే 4న పాలసీ రేట్లను 40 బేసిస్‌ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని 50 బేసిస్‌ పాయింట్ల  మేర పెంచిన సంగతి తెలిసిందే. దీనితో రెపో రేటు (బ్యాంకులకు తాను ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ విధించే వడ్డీ రేటు) 4.40 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు