ఆరు బ్యాంక్‌ లైసెన్సులకు ఆర్‌బీఐ తిరస్కృతి

18 May, 2022 08:30 IST|Sakshi

ముంబై: స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులతో సహా బ్యాంకుల ఏర్పాటు కోసం వచ్చిన ఆరు దరఖాస్తులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తిరస్కరించింది. బ్యాంకుల ఏర్పాటుకు తగిన స్థాయి దరఖాస్తులు కాకపోవడంతో వీటిని తిరస్కరించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంక్‌ లైసెన్సులకు సంబంధించి తిరస్కరణ జాబితాలో  యూఏఈ ఎక్సేంజ్‌ అండ్‌  ఫైనాన్షియల్‌ సర్వీసెస్,  ది రిపాట్రియాట్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఆర్‌ఈపీసీఓ బ్యాంక్‌), చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పంకజ్‌ వైష్‌ ఉన్నాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి వీసాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, క్యాలికట్‌ సిటీ సర్వీస్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌  నేతృత్వం వహిస్తుండటం గమనార్హం.   

మొత్తం 11 దరఖాస్తులు 
‘ఆన్‌ ట్యాప్‌’ లైసెన్సింగ్‌ ఆఫ్‌ యూనివర్శ్‌ల్‌ బ్యాంక్స్‌ అండ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్స్‌ మార్గదర్శకాల కింద బ్యాంకుల ఏర్పాటు 11 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పైన పేర్కొన్న ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా,  మరో ఐదు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ 5 స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ఉద్దేశించినవి కావడం గమనార్హం.   వెస్ట్‌ ఎండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, అఖిల్‌ కుమార్‌ గుప్తా, ద్వార క్షేత్రీయ గ్రామీణ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కాస్మియా ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, టాలీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దరఖాస్తుదారులలో ఉన్నాయి.
 

చదవండి: Sachin Bansal: ఒక్క లోను పొందాలంటే వంద తిప్పలు.. అందుకే ‘నావి’ వచ్చింది

మరిన్ని వార్తలు