బ్యాంకింగ్‌ లైసెన్సులకు 8 దరఖాస్తులు

16 Apr, 2021 06:07 IST|Sakshi

ముంబై: బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బీ) ఏర్పాటుకు సంబంధించిన లైసెన్సులకు ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ‘ఆన్‌ ట్యాప్‌’ (ఎప్పటికప్పుడు దరఖాస్తులు చేసే విధానం) లైసెన్సింగ్‌ మార్గదర్శకాల కింద బ్యాంకుల ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు గురువారం వెల్లడించింది.  

దరఖాస్తు సంస్థలు ఇవీ...
► యూఏఈ ఎక్సే్ఛంజ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, ది రిప్యాట్రియట్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (రెప్కో బ్యాంక్‌), చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్, పంకజ్‌ వైష్‌ బ్యాంక్‌ లైసెన్సుకు  దరఖాస్తు చేశాయి.

► చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల  లైసెన్సింగ్‌ కోసం మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులు–– విసాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కాలికట్‌ సిటీ సర్వీస్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్, అఖిల్‌ కుమార్‌ గుప్తా,  ద్వారా క్షేత్రీయ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.

► ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 2016 ఆగస్టు 1వ తేదీన అలాగే  ఎస్‌ఎఫ్‌బీల ఏర్పాటుకు 2019 డిసెంబర్‌ 5వ తేదీన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం బ్యాంకుల ఏర్పాటుకు తొలి కనీస పెయిడ్‌–అప్‌ ఓటింగ్‌ ఈక్విటీ మూలధనం రూ.500 కోట్లు ఉండాలి. అలాగే కనీస నెట్‌వర్త్‌ రూ.500 కోట్లును నిర్వహించాల్సి  ఉంటుంది. ఎస్‌ఎఫ్‌బీల విషయంలో ఇది రూ.200 కోట్లు. అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎస్‌ఎఫ్‌బీగా మా రాలని కోరుకుంటే, నెట్‌ వర్త్‌ తొలుత రూ.100 కోట్లు ఉంటే సరిపోతుంది. ఐదేళ్లలో ఈ మొత్తం రూ.200 కోట్లకు పెరగాల్సి ఉంటుంది.   

► బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఏర్పాటుకు సమర్పించే దరఖాస్తులను మదింపుచేసి, తగిన సలహాలను సమర్పించడానికి ఆర్‌బీఐ గత నెల్లో ఒక స్టాండింగ్‌ ఎక్స్‌టర్నల్‌ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఈఏసీ)ని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ శ్యామలా గోపీనాథ్‌ నేతృత్వం వహిస్తారు. కమిటీ కాలపరిమితి మూడేళ్లు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ రేవతీ అయ్యర్, ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలాగే ప్రస్తుత ఎన్‌పీసీఐ చైర్మన్‌ బీ మహాపాత్ర, కెనరా బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ టీఎన్‌ మనోహరన్, ఎస్‌బీఐ మాజీ ఎండీ అలాగే పీఎఫ్‌ఆర్‌డీఏ మాజీ చైర్మన్‌ హేమంత్‌ జీ కాంట్రాక్టర్‌లు కమిటీలో ఉన్నారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు