-

రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యం

23 Oct, 2021 06:09 IST|Sakshi

ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి

ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడమే లక్ష్యమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. తద్వారా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 4 శాతం)ను యథాతథంగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు అక్టోబర్‌ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన సెంట్రల్‌ బ్యాంక్‌ ద్వైమాసిక సమావేశాల మినిట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి.  దీని ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్‌బీఐ అంచనాలతో  రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్‌బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటు 5.7 శాతం  ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది.

దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్‌ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్‌  ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్‌బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.  2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శా తం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుం దని ఆర్‌బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు